Skip to Content

తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

చెరలో నుండి ధైర్యమును, ఉత్సాహము నిచ్చు ఒక పత్రికను వ్రాయునదియనుట ఒక అరుదైన కార్యము. అయితే అటువంటి ఒక పత్రికగా తిమోతి రెండవ పత్రిక కనబడుచున్నది. ఈ పత్రికలో పౌలు తిమోతి పైనున్న తన ప్రేమను, అతని కొరకు ప్రార్ధించుటయును గూర్చి ధృడపరచిన పిదప తాను తన యొక్క ఆత్మీయ తండ్రి అనియు, బాధ్యతలను గూర్చి అతనికి జ్ఞప్తి చేయుచున్నాడు. ఒక సైనికుడైనను మల్లయుద్ధము చేయువాడైనను, వ్యవసాయి యైనను, యేసుక్రీస్తు యొక్క సేవకుడైనను, విడువక పోరాడినట్లయితేనే ప్రతిఫలమును పొందగలడు. అంత్య దినములలో ప్రజలు సత్య మార్గమును విడిచి చెవులకు యింపైన ప్రసంగములను విను కాలములో క్రైస్తవ జీవితము కూడ మాని బలమును కోల్పోయి భక్తి వేషములో మునిగిపోవునని పౌలు హెచ్చరించుచున్నాడు. అయితే అటువంటి పడిన స్థితిలో కూడ పౌలు యొక్క సాదృశ్యము తిమోతికి మార్గదర్శిగాను, దేవుని వాక్యము అతనిని బలపరచుటకును ఎంతైనను చాలినంతవిగా నుండెను.

ఉద్దేశము:- ఎఫెసు సంఘ సేవకుడైన తిమోతికి చివరి బుద్ధి మాటలను ప్రోత్సాహమును కలుగజేయుట.

గ్రంథకర్త:- పౌలు

ఎవరికి వ్రాసెను:- తిమోతికి.

వ్రాసిన కాలము: - రోమా చెరలోనుండి క్రీ.శ. 66 లేక క్రీ.శ.67 లో వ్రాయబడినది. మొదట సారి ఖైదు చేయబడిన పౌలు తదుపరి విడుదల చేయబడెను. రెండు సంవత్సరముల తరువాత తిరిగి ఆయన ఖైదు చేయబడి నీరో చక్రవర్తిచే శిరచ్ఛేదనము చేయబడెను.

ఆంతర్యము:- తనకు చెరలో సహాయము చేయుటకు లూకా ఉండినప్పటికిని కార్యరూపములో ఎప్పుడును; పౌలు ఒంటరిగానేయుండెను. క్రొత్త తరము యొక్క సంఘ అధ్యక్షతకు తనను పానార్పణముగా అప్పగించుట కొరకై అతడు ఈ పత్రికను వ్రాయుచున్నాడు. స్నేహితులు తన్ను సంధించవలయుననియు అంగీని, పుస్తకములను చర్మపు కాగితములను కావలెననియు పౌలు తన అభిలాషను వెలిబుచ్చెను.

ముఖ్య మనుష్యులు:- పౌలుతిమోతిలూకామార్కు.

ముఖ్య పదజాలము:- అపకారమును ఓర్చుకొనుట

ముఖ్య వచనములు:- 2 తిమోతికి 2:3-42 తిమోతికి 3:14-17.

ముఖ్య స్థలము: - రోమాఎఫెసు

గ్రంథ విశిష్టత:- ఇది పౌలు యొక్క చివరి పత్రిక. ఇందులో ఆయనయొక్క హృదయ వాంఛలను జీవితములో ప్రాధాన్యమైన, ఆరోగ్యమైన ఉపదేశము, దృఢము, విశ్వాసము, ప్రేమ మొదలైనవాటిని ప్రకటించుచున్నాడు.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 2. సంపూర్ణ సేవలో నిమగ్నులైయున్న క్రైస్తవ సేవకులందరును, ప్రతిదినము చదివి, ధ్యానించవలసిన ఒక భాగము. ఇది స్థిరముగా నిలుచుటయు విజయవంతమైన ఒక క్రైస్తవ సేవ యొక్క తాళపుచెవిని పౌలు ఇందులో చూపించుచున్నాడు.

ప్రతిఫలమునిచ్చు సేవ, వచనము 1,2

సహనముతో చేయు సేవ. వచనము 3-13

వాక్యము చదువుచుచేయు సేవ- వచనము 14-18

పరిశుద్ధతతో నిండిన సేవ. వచనము 19-26

గ్రంథ విభజన:- ఈ చివరి పత్రికను వ్రాయుచుండినపుడు అతని యొక్క ఇహలోక జీవితదినములు త్వరగా దాని అంతము సమీపించియుండునదని పౌలు గ్రహించెను. భారము తొలగి సేద తీర్చుకొననిష్టపడువాడుగా నుండినను దైవ భక్తి కలిగిన అపొస్తలుడు, కొంచెం భయస్తుడును, అయితే మిక్కిలి యధార్ధమైనవాడును, తన సహ సేవకుడునైన తిమోతిని ఎఫెసు సంఘము యొక్క కష్టతరమైన పరిచర్యకు సిద్ధపరచుటకే ఈ పత్రికను వ్రాసెను. పత్రికలోని రెండు ముఖ్య విషయములు క్రిందచూడుడి.

  1. తాత్కాలిక శోధనలో దృఢముగా నిలిచియుండుము. అధ్యాయము 1,2
  2. భవిష్యత్ కాల శోధనలలో సహనము వహించుము. అధ్యాయము 3,4

కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 55వ పుస్తకము; అధ్యాయము 4; వచనములు 83; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 68; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 5.


Share this post