Skip to Content

తీతుకు వ్రాసిన పత్రిక

  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

క్రేతు సంఘము యొక్క బాధ్యతల కొరకు నియమింపబడినవాడైన తీతుకు ఆ సంఘమును పరామర్శించి జరిగించుటకైన బాధ్యత మిక్కిలి భారమైనదిగా నుండెను. అచ్చటనున్న ఒక్కొక్క పట్టణము యొక్క సంమములకును, పెద్దలుగా నుండుటకు నిష్కళంక గుణము పరిశుద్ధతయుగల మనుష్యులను నిర్ణయించవలెనని పౌలు అతనికి ఆజ్ఞాపించుచున్నాడు. సంఘ సేవకులు మాత్రమేగాక సంమములోని వారందరును ఆడ మగ యను బేధము లేక వయపరిమాణము చూడక వారు విశ్వసించు సత్యములను జీవితములో అనుసరించుచూ వచ్చినట్లయితేనేగాని సంఘము జీవముగలదిగా నుండును. పత్రిక ద్వారా రక్షణ యొక్క ఈ అనుభవపూర్వకముగా చేయుటను గూర్చియే పౌలు చెప్పుచున్నాడు.

ఉద్దేశము:- క్రేతు సంఘ బాధ్యతను తీతుకు యివ్వవలసిన బాధ్యతను బోధించుట

గ్రంథకర్త:- పౌలు

ఎవరికి వ్రాసెను?: - తీతుకు, గ్రీకు వాడైన తీతు పౌలు యొక్క సేవా ఫలితముగా విశ్వాసములోనికి వచ్చినవాడుగా నుండవలెను. క్రేతు దీవి సంమములకు పౌలు యొక్క ప్రతినిధిగా తీతు పంపబడెను.

వ్రాసిన కాలము: - క్రీ.శ.64-లో ఈ కాల సందర్భములోనే పౌలు 1తిమోతి పత్రికను కూడ వ్రాసెను. రెండుసార్లు చెరనివాసముకు మధ్య మాసిదోనియాలో నుండి పౌలు ఈ పత్రికను వ్రాసియుండవచ్చును.

ఆంతర్యము: - మధ్యధరా సముద్రపు దీవియైన క్రేతు సుమారు 156 మైళ్ళ పొడవును, 30 మైళ్ళ వెడల్పును గలది. మొదటి శతాబ్దములో ఇక్కడ జీవించిన ప్రజలు అవాచ్యమైన కార్యములకును, దుర్నీతికిని, దుష్కీర్తి పొందినట్టి వారిగా నుండిరి. “క్రేతువానివలె ప్రవర్తించు” అనుమాటకు దొంగ ప్రవర్తన యని అర్ధము. పౌలు క్రేతు దీవి సంఘములను చూచుకొనుటకును అక్కడి కార్యములను క్రమపరచుటకును, తీతును అక్కడకు పంపెను. ఈ కార్యములు ఎట్లు నెరవేరవలెనని పౌలు చెప్పుచున్నాడు.

ముఖ్య మనుష్యులు:- పౌలుతీతు.

ముఖ్య పదజాలము:- సంఘ క్రమ విధులు.

ముఖ్య వచనములు:- తీతుకు 1:5తీతుకు 3:8.

ముఖ్య స్థలములు:- కేతు, నికొపోలి.

గ్రంథ విశిష్టత:- తీతు, 1తిమోతి మొదలగునవి ఒకే స్వభావమును వెలువరచు పత్రికలై యున్నవి. రెండింటిలోను పెద్దలకైన బుద్ధిమాటలు చెప్పుచున్నాడు.

ముఖ్య అధ్యాయము:- తీతు 2. సంఘములోని విశ్వాసులు దేవుని చిత్తానుసారముగా బ్రదుక ఈ అధ్యాయములో పౌలు ముఖ్యమైన ఆజ్ఞలు బోధించుచున్నాడు. దేవుని ప్రజలందరు ఈ ఉపదేశములకు సంపూర్ణమైన విధేయతను చూపవలెననునది పౌలు యొక్క వాంఛయైయున్నది.

గ్రంథ విభజన:- పౌలు తీతును లోపముగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే క్రేతులో విడిచి వచ్చెను(తీతుకు 1:5) ఈ పత్రికలో సరియైన బోధను నొక్కి వక్కాణించి, సత్యమును మార్చి చెప్పువారికి వ్యతిరేకముగా హెచ్చరిక నిచ్చుచున్నాడు. అయితే సంఘ ప్రజలు సత్క్రియలందాసక్తి గలవారుగా జీవించుటకైన ఆజ్ఞలే దీని యొక్క ముఖ్యద్దేశము అని చెప్పవచ్చును. రెండు ముఖ్య భాగములుగా ఈ పత్రికను విభజింపవచ్చును.

  1. పట్టణమంతయు పెద్దలను ఏర్పరచుట. అధ్యాయము 1. (2.) ఇతర కార్యములను సరిదిద్దుట. అధ్యాయము 2, 3.

ఈ పత్రిక కు తిమోతితోనున్న ఏకత్వము:- తీతును తిమోతియు ఒకే కాలములో సుమారు క్రీ.శ.64లో వ్రాయబడినవైయున్నవి. పెద్దలను నియమించుటయను ఒకే కార్యమునే రెండు పత్రికలును చెప్పుచున్నవి. తీతు క్రేతులోను, తిమోతి ఎఫెసులోను ఎదుర్కొన్న సంభవములు ఇంచుమించు ఒకే విధమైనవైయున్నవి. రెండు ముఖ్య భాగములుగా ఈ పత్రికను విభజించవచ్చును.

కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 56వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 46; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 45; నెరవేరిన ప్రవచనములు 1.


Share this post