Skip to Content

థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

బాల ప్రాయమున నున్న థెస్సలొనీక సంమములో పౌలు గడిపిన దినములను సంతోషముతో స్మరించుచున్నాడు. వారి విశ్వాసము, నమ్మిక, ప్రేమ వంటివి, శ్రమల మధ్యను వారు చూపిన సహనమును మాదిరిగ నుండెను. రెక్కలు వచ్చి ఎగురుటకు ప్రయత్నించుచున్న పక్షి పిల్లవలె, క్రైస్తవ్యమందు వృద్ధి పొందుచున్న సంఘము కొరకు పౌలు భరించిన శ్రమలు, త్యాగమును మంచి ఫలితము నిచ్చుటచే పౌలు వారి యెడల గలిగిన ప్రేమ పత్రిక యొక్క ఒక్కొక్క భాగమందును ప్రకాశించుచున్నది.

నూతనముగ పొందిన విశ్వాసములో వారు బలపడుటకును, ప్రేమలో ఒకరికొకరు వృద్ధి చెందుటయు, ఎల్లప్పుడును సంతోషముగా నుండుటకును, ఎడతెగక ప్రార్థించుటకును, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును పౌలు వారికి బోధించెను. ప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చిన ప్రకటనతో అతడు పత్రికను ముగించెను. మృతులును, సజీవులమునైయున్న విశ్వాసులందరికిని నమ్మికను, ఆదరణను యిచ్చునదే క్రీస్తు యొక్క రెండవ రాకడ.

ఉద్దేశము:- థెస్సలొనీకయ విశ్వాసుల క్రైస్తవ విశ్వాసమును బలపరచుటకును, క్రీస్తు మరల వచ్చునని నిశ్చయతనిచ్చుటకును.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- థెస్సలొనీకయ సంఘమునకు, విశ్వాసులు యావన్మందికిని.

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ 51లో పౌలు యొక్క మొదటి పత్రికలలో యిది ఒకటి. పౌలు దినముల యందు థెస్సలొనీక ఒక రేవు పట్టణమును, మాసిదోనియ అను రోమా దేశము యొక్క రాజధానిగనుండెను.

రోమా నుండి తూర్పు దేశముల కొరకైన ముఖ్య రాజమార్గమునకు ప్రక్కన గల యీ స్థలము రాజకీయ, వాణిజ్య ముఖ్యత్వములచే మిగుల సస్యశ్యామలముగనుండెను. క్రీ.శ. మొదటి శతాబ్దములో యిచ్చట దాదాపు రెండు లక్షలమంది ప్రజలు జీవించినట్లు చెప్పబడుచున్నది.

     థెస్సలొనీకయనందు యూదులు గొప్ప సంఖ్యలో జీవించిరి. సన్మార్గమును ఆధారముగా గల వారి ఒకే దేవుని ఆరాధించుట, గ్రీకుల పలు దేవతారాధనలలో అలసిపోయి దాని నుండి విడిపించు కొనుటకు ప్రయత్నించువారిని ఆకర్షించెను. ఇందుచే పౌలు యొక్క రెండవ సువార్త సేవా ప్రయాణమందు అతడు థెస్సలొనీకయ యూదా దేవాలయములో ప్రకటించిన సువార్త వర్తమానము త్వరలో ప్రజలు ఒప్పుకొనునదిగనుండెను. (అపో. కార్యములు 17:4).

ఆంతర్యము:- ఈ పత్రికను పౌలు వ్రాయునప్పుడు థెస్సలొనీక సంఘము స్థాపించబడి రెండు లేక మూడు సంవత్సరములు మాత్రమే అయ్యెను. వారు విశ్వాసమందు పరిపక్వతను పొందవలసిన వారుగా నుండిరి. క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి వారికి ఒక తప్పుడు తలంపు ఉండెను. క్రీస్తు త్వరగా వచ్చునని ఎదురు చూచుచుండిన కొందరిలో ప్రియమైన వారు మరణించినప్పుడు ఆ మృతి చెందిన వారి భవిష్యత్ కాలము ఎటువంటిదని వారికి సంశయమేర్పడెను. వారిక సంశయములను తీర్చుటకును, శ్రమలనుభవించుచున్న విశ్వాసులను ఆదరించుటకును ఈ పత్రిక వ్రాసెను.

ముఖ్య పదజాలము:- క్రీస్తు రాకడ యందు లభించు పరిశుద్ధ పరచబడుట.

ముఖ్య వచనములు:- 1 థెస్సలొనీకయులకు 3:12-131 థెస్సలొనీకయులకు 4:16-18.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 4. పత్రిక యొక్క మధ్య భాగము యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి చెప్పు నాలుగవ అధ్యాయ భాగమగును. ఆయన వచ్చు దినమున క్రీస్తునందు మృతులగువారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని ఈ అధ్యాయము చెప్పుచున్నది.

గ్రంథ విభజన:- బలవంతపరచబడుటచే థెస్సలొనీకయను విడిచి వెళ్ళిన పిదప థెస్సలొనీకయను గూర్చి పౌలుకు గల అక్కర పెరిగి వారి విశ్వాసపు ఎదుగుదల కొరకు మేల్కొలుపు గలిగియుండెను. తిమోతి తెచ్చిన ఆదరణ వర్తమానముచే సంతృప్తి చెంది పౌలు వారిని పొగడి, బోధించి ఆదరించి వ్రాసిన ఈ పత్రికలో రెండు ముఖ్య భాగములను చూడగలము.

(1) థెస్సలొనీకయులను గూర్చిన పౌలు యొక్క వ్యక్తిగత స్మరణ అధ్యాయము 1-3.

(2) పౌలు వారికిచ్చిన బోధనలు అధ్యాయము 4,5

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 52వ పుస్తకము, అధ్యాయములు 5; వచనములు 89; ప్రశ్నలు 3; చారిత్రక వచనములు 69; నెరవేర్చబడిన ప్రవచనములు 20.


Share this post