- Author: Sajeeva Vahini
- Category: Bible Study
- Reference: Sajeeva Vahini
ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము.
1 సమూయేలు - మనుష్యుని అర్హతలను బట్టి సరి అయిన రాజు - సౌలు.
2 సమూయేలు - ఆత్మీయ యోగ్యతలను బట్టి దేవుడు ఎన్నుకున్న రాజు - దావీదు.
1 రాజులు - సొలోమోను, ఇశ్రాయేలు.
2 రాజులు - ఇశ్రాయేలీయుల రాజవంశము.
1 దినవృత్తాంతములు - సొలొమోను, దేవాలయము.
2 దినవృత్తాంతములు - రాజంశములు, దేవాలయము.
ఇశ్రాయేలీయులలో 500 సంవత్సరాల రాజుల పాలన చరిత్ర ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నది. ఈ పుస్తకములో తలఎత్తి నిలువబడిన ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను ఈ గ్రంథకర్త మన దృష్టికి తీసుకువస్తున్నాడు.
(1). చివరి న్యాయాధిపతియైన సమూయేలు. (2). మొదటి రాజైన సౌలు. (3). అభిషేకము పొందిన రాజు గా ఉండినప్పటికి 10 సంవత్సరాలు పారిపోయి దాగుకొనిన దావీదు.
జీవిత చరిత్రకు ఆకర్షణీయమైన వస్త్రములను ధరింపజేసి గ్రంథకర్త పొందుపరచాడు. అందరు ఇష్టపడు ఒక విషయము. సన్నివేశమును వివరించుట. క్రైస్తవ కుటుంబములలో పెరిగే చిన్న బిడ్డలు పిన్న వయసు నుండి వినే కథలుగా చిన్న సమూయేలు జీవితము (అధ్యా - 3), దావీదు - గొల్యాతును సంధించుట (అధ్యా 17), దావీదు యోనాతానుల స్నేహము (అధ్యా 18లో) కనబడుచున్నవి.
పుస్తకము యొక్క పేరు : హెబ్రీబైబిలులో సమూయేలు 1, 2 పుస్తకములు ఒకే సమూయేలు పుస్తకముగా కనబడుచున్నవి. సమూయేలు అను పేరునకు “దేవుని దగ్గర అడిగిపొందబడినవాడు” అని అర్థము. జీవితమంతటిని దేవుని కొరకు అప్పగించుకొనిన సమూయేలు, అన్నింటికంటే పైగా ఒక ప్రార్ధనా వీరుడుగా ఉన్నాడు. ప్రార్థనా శక్తికి మార్గము చూపించే ఒక పుస్తకముగా సమూయేలు గ్రంథము ఉన్నది. న్యాయాధిపతుల పరిపాలనలోని అంధకారయుగములో జీవించిన ఒక ప్రార్థనా పరురాలి చరిత్రతో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. ఈ విధముగా దేవునిని అడిగి ఆమె పొందిన సమూయేలు ఏలీ ఎదుట యోహోవాను సేవించెను (1 సమూయేలు 3:1) దేవునికి ఉపయోగకరమైన పాత్రగా బాలుడైన సమూయేలు ఉన్నాడు. (1 సమూయేలు 3:1-19) దేవుని ప్రజలకు ప్రార్థన ద్వారా జయమును సంపాదించే ప్రవక్తగా సమూయేలు పెరిగెను. (1 సమూయేలు 7:5-10). తన ప్రజలు ఒక రాజు కొరకు అడిగినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసెను (1 సమూయేలు 8:6. ఈ విధముగా విజ్ఞాపన ప్రార్థన సమూయేలు యొక్క జీవితములో ముఖ్యమయిన భాగముగా ఉన్నది.
ఉద్దేశము : ఇశ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు జీవిత చరిత్ర, మొదటి రాజైన సౌలు పరిపాలనా మరియు పతనము, ఇశ్రాయేలీయుల మహోన్నతమైన రాజుగా దావీదును ఎన్నుకొనుట. తర్ఫీదు చేయుట యొక్క వివరములు.
గ్రంథకర్త : సమూయేలు (నాతాను, గాదు అనే ప్రవక్తల రచనలు కూడా ఉన్నవి. 1 దినవృత్తాంతములు 29:29.
గత చరిత్ర : న్యాయాధిపతుల కాలంలో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. దేవుని పరిపాలన నుండి రాజుపాలనకు పరివర్తన చెందుటను గూర్చి వివరించుచున్నది.
ముఖ్యవచనములు : 1 సమూయేలు 8:7-9
ముఖ్యమైన వ్యక్తులు : ఏలీ, హన్నా, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు.
గ్రంథ విభజన : సమూయేలు మొదటి పుస్తకమును మూడు భాగములుగా విభజింపవచ్చును.
- సమూయేలు న్యాయము తీర్చిన కాలము ( అధ్యా 1-7); 2. సౌలు పరిపాలనా కాలము (అధ్యా 8 -15 ); 3. సింహాసనమును పొందిన దావీదు అజ్ఞాతవాస కాలము ( అధ్యా 16 -31) ఈ కాలములో సౌలు రాజుగా కొనసాగాడు గిల్బోవ పర్వత శిఖరమున సౌలు, అతని కుమారులు చనిపోయిన వెంటనే దావీదు తిరుగులాడిన కాలము ముగిసినది.
పుస్తకము యొక్క చివరి అధ్యాయములో (అధ్యా 31) నల్లని బట్టలు ధరించిన దుఃఖభరితమైన, కథ చాలా హీనమైన, పడిపోయిన దృశ్యమును చూచుచున్నాము. సొంతకత్తి మీదపడి చనిపోయిన సౌలు సొంత కత్తితో ఆత్మహత్య చేసికొని చనిపోయిన మనిషి యొక్క ప్రతిబింభమును అక్కడ చూచుచున్నాము. బంగారు యౌవనమో లేక సాధించిన గొప్ప విజయములో జీవితముగింపులో జయమునకు హద్దుగా ఉండవు. లోబడుటలో జీవిత ముగింపు వరకు నిలిచే వ్యక్తులే జీవ కిరీటమునకు యోగ్యులగుదురు. లోబడకపోవుట, గర్వం, అసూయ మొదలగు వాటికి, ఎరగా మారి నాశనమైన ఒక వ్యక్తి యొక్క విషాధమైన చిత్రముతో ఈ పుస్తకము యొక్క కథకు తెరదిగుచున్నది.
ఈ కొన్ని క్లుప్త వివరములు : 9వ పుస్తకము : అధ్యాయములు 31; వచనములు 810; ప్రశ్నలు 157; నెరవేరిన ప్రవచనములు 50; నెరవేరని ప్రవచనము 1; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 29; వాగ్దానములు 4; ఆజ్ఞలు 117; హెచ్చరికలు 57.