Skip to Content

రూతు

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

న్యాయాధిపతుల యొక్క అంధకార యుగములో కల్తీలేని ప్రేమతో, నిష్కపట భక్తికి వర్ణకాంతులు విరజిమ్ముచున్న ఒక ఆదర్శ స్త్రీ చరిత్ర రూతు గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను, ఆచారములను త్రోసివేసి బెత్లెహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీయే ఈ పుస్తకము యొక్క కథానాయకురాలు. బోయజు అనే ఉత్తమ భర్తను, ఓబేదు అనే మంచి కుమారుని ఆమె యొక్క భక్తి, ప్రేమ, దీనత్వము మొదలగు వాటికి బహుమతులుగా దేవుడు ఇచ్చెను. దావీదు రాజు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రియే ఈ ఓబేదు. ఈ విధముగా ఆమె దావీదు పితరుల వంశావళి పట్టికలో స్థానం పొందినది. ఐక్యత అనే అర్ధమునిచ్చే “రియూత్ " అనే హెబ్రీమాట యొక్క అర్థమే రూతు అను పేరు.

రూతు యొక్క కాలము: రూతు కథ నాలుగు రకములైన పరిస్థితులతో జరుగుచున్నది. రూతులో జరిగిన సంఘటనలు నాలుగు విభిన్న పరిస్థితులుగానుండెను. 1. మోయాబు దేశము (రూతు 1:1-18); 2. బెత్లెహేములో ఒక పంట పొలము (Ruth,1,19-2,23); 3. బెత్లెహేములోని ఒక ధాన్యపు కళ్లము (రూతు 3:1-18); 4. బెత్లెహేము నగరము (రూతు 4:1-21). ఇశ్రాయేలుకు పొరుగు రాజ్యమైన మోయాబు దేశము మృత సముద్రము యొక్క ఈశాన్యములో ఉన్నది. రూతు యొక్క మొదటి వచనము గత చరిత్రను స్పష్టీకరించుచున్నది. చూడండి, “న్యాయాధిపతులు యేలిన దినములయందు” (రూతు 1:1) విశ్వాసము, త్యాగము, యుద్ధము, క్రమశిక్షణా రాహిత్యము, అక్రమము, అరాచకము అనునవి రాజ్యమేలిన ఆ అంథకార యుగములో దేవుని ఆజ్ఞలను పట్టుదలతో వెంబడించిన ప్రజలు దేశములో ఉండినట్లుగా ఈ పుస్తకము దృఢపరచుచున్నది. ఆ ప్రత్యేక కాలమట్టము యొక్క చరిత్ర సందేశమును చెప్పుట మాత్రమే గాక, అందమైన ఒక సంభవమును చిత్రించుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. కనుక దీని వర్తమానకాలమును గణించుట కఠినమైనది. కాని ముందుగా చెప్పిన నాలుగు పరిస్థితులను ప్రాథమికముగా పెట్టుకొని అది జరిగిన కాలమును మనము ఈ విధముగా గుర్తించవచ్చును. (1). రూతు 1:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము మోయాబుదేశము, కాలము - సుమారు 10 సంవత్సరాలు. (2). Ruth,1,19-2,23 లోని దృశ్యము జరిగిన స్థలము - బేల్లెహేములోని ఒక పొలము, కాలము - సుమారు 1 నెల. (3). రూతు 3:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము - బేబ్లె హేములోని ఒక కళ్లము, కాలము - ఒక రాత్రి. (4) రూతు 4:1-22 లోని దృశ్యము జరిగిన స్థలము - బెత్లెహేము నగరము. కాలము ఒక సంవత్సరము.

ఉద్దేశము: చుట్టు ఉన్నవారందరు తొట్రిపడిపోవుచున్నప్పుడును, శ్రేష్ట స్వభావములోను, దేవునితో ఉన్న యథార్ధ సంబంధములోను ఏవిధముగా స్థిరముగా నిలబడగలము అను చూపించుట కొరకు.

గ్రంథకర్త: పుస్తకములోని ఏ భాగములోను గ్రంథకర్తను గురించిన వివరములు లేవు. దీని గ్రంథకర్త రచించినది సమూయేలు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఈ పుస్తకములో తేటగా చెప్పబడిన కొన్ని భాగములను బట్టి చూచినట్లయితే సమూయేలు మరణము తరువాత ఇది వ్రాయబడినది.

కాలము: న్యాయాధిపతుల కాలము. క్రీ.పూ. 1375 – 1050.

నేపథ్యము: తమ ఇష్టానుసారముగా జీవించిన ఇశ్రాయేలీయుల అంథకారయుగము. (న్యాయాధిపతులు 17:6ముఖ్యవచనము: రూతు 1:16.

ముఖ్యమైన వ్యక్తులు: రూతునయోమిబోయజు.

ముఖ్యమైన స్థలములు: మోయాబు, బెత్లెహేము.

గ్రంథ విభజన: 1. నయోమి మోయాబుకు వెళ్ళి నివశించుట, తిరిగి వచ్చుట. రూతు 1:1-22. 2. రూతు స్వీకరించబడినది Ruth,2,1-3,18. 3. బోయజురూతు రూతు 4:1-21.

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 8వ పుస్తకము ; అధ్యాయములు 4; వచనములు 84; ప్రశ్నలు 16; ప్రవచనములు లేవు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్త ద్వారా కూడా సందేశమును తీసుకురాని మొదటి పుస్తకము, ఆజ్ఞలు 30; వాగ్దానములు 2.


Share this post