Skip to Content

రోమీయులకు వ్రాసిన పత్రిక

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

పౌలు యొక్క అతి శ్రేష్ఠమైన ఒక సృష్టి రోమీయులకు వ్రాసిన పత్రిక. క్రొత్త నిబంధన యందు చేర్చబడిన అతని 13 పత్రికలును యేసుక్రీస్తు యొక్క కార్యములను, ఉపదేశములను గూర్చి పలుకగా, రోమా పత్రిక క్రీస్తు యొక్క బలి మరణము యొక్క ముఖ్యత్వమును గూర్చి చెప్పుచున్నది. ఒక ప్రశ్న- జవాబు అను విధానము గలిగి పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యపూర్వమైన ఉపదేశముల సమూహమును అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక యందు వ్రాసి యున్నాడు. ఈ గ్రంథము ఒక దైవత్వము గల గ్రంథమనుటకు పూర్వమే అనుచరణ విధానపు బోధనలు గల ఒక సమూహముగా నున్నది.

గ్రంథ రచయిత:- బోధనల పునాదికి ముఖ్యత్వము వహించిన ఈ పత్రికను పౌలు వ్రాసెను. (రోమీయులకు 1:1) పదజాలము, ప్రవర్తన ఉద్దేశముల సమూహము, దైవత్వము యొక్క అనుకరణ విధానము మొదలగు వాటిలో ఇది పౌలు యొక్క ఇతర పత్రికలకు సంబంధించియున్నది. పౌలు చెప్పుచుండగా తెరియు అనునతనిని వ్రాయమని చెప్పి (రోమీయులకు 16:22) వ్రాసిన వాని అభినందనలను దీనితో కలుపుటకు అనుమతిని ఇచ్చియున్నాడు.

ఉద్దేశము:- రోమా ప్రజలకు పౌలును పరిచయం చేయుటయును, అతను రోమాకు వెళ్ళుటకు ముందు అతడు చెప్పు వర్తమానపు మాదిరిని వారికి ఇచ్చుటయును.

ఎవరికి వ్రాసెను?:- రోమా యందు గల క్రైస్తవులకును, అన్ని చోట్ల గల విశ్వాసులు యావన్మందికిని.

వ్రాసిన కాలము:- దాదాపు క్రీ.శ. 57లో కొరింథు నుండి యెరూషలేమునకు వెళ్ళుటకు పౌలు సిద్ధపడుచుండినపుడు.

ఆంతర్యము:- తూర్పు దేశములందు యించుమించు తన పరిచర్యను నెరవేర్చిన తరువాత స్పెయినుకు వెళ్ళు మార్గమందు రోమాను సంధించుటకు పౌలు ఇష్టపడెను. అయితే అంతకు ముందు యెరూషలేము లోని బీదలైన విశ్వాసుల కొరకు సహాయనిధిని చేర్చుటకు ప్రారంభించెను. (రోమీయులకు 15:22-28రోమా సంఘము యొక్క అధిక పక్షపు వారు యూదులైనప్పటికిని అన్యజనులు అనేకులుండిరి.

ముఖ్య పాత్రలు: - పౌలుఫీబే

ముఖ్య స్థలము:- రోమా

గ్రంథ విశిష్టత:- పౌలు తన విశ్వాసమును బట్టబయలుగా ఒప్పుకొని అప్పగించు రీతిలో రోమా పత్రికను వ్రాసెను. ఇది ప్రతినిధిత్వ బహువచనము గల ఒక మాదిరి పత్రిక కాదు. అయితే పత్రిక చివరి భాగమును రోమీయులకు అభినందనలు తెలుపుటకు అధిక సమయమును తీసికొనెను.

పత్రికను ఎందుకు వ్రాసెను?:- “దేవుని చిత్తము యొక్క ముగింపు మాటలే మోషే యొక్క చట్టములు. అన్య జనులు క్రైస్తవులుగా మారుటలో ఆక్షేపణ లేదు. అయితే మొదట వారు సున్నతి పొంది మోషే ధర్మ శాస్త్రమును నెరవేర్చిన తరువాత మాత్రమే క్రైస్తవులు కాగలరు.” ఇది రోమా సమాజపు ఒక పక్షపు విశ్వాసులు మూర్ఖ వివాదము. మరియొక పద్ధతిలో దీనిని చెప్పినచో యూదా మతమును అంగీకరించని ఒకడు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందగలడా అనునదే వారి సమస్య. క్రైస్తవ్యము యొక్క ప్రారంభము యూదా మతము నందుండియున్నచో ఆ రీతిగా ఎట్లయిననూ కొనసాగించవలెననునదే వారి మధ్య గల యూదా మత నాయకుల స్థిరమైన తీర్మానము. ఒక అన్యునుకి యూదా మతమునంగీకరించుటకు సున్నతి అనునది ఒక ప్రాముఖ్యముగా నెరవేర్చవలసిన ఒక మత సంస్కారముగా నుండెను.

నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి-పౌలు యొక్క వివరణ: - నీతిమంతులగు వారి విషయము క్రీస్తు ద్వారానే తప్ప మోషే యొక్క ధర్మ శాస్త్రము ద్వారా దేవుని యెదుట మనుష్యుని నీతిమంతునిగా తీర్చలేము అని ఈ పత్రిక ద్వారా బయలుపడుచున్నది. దేవుని పరిశుద్ధతను బయలుపరచి చూపునది ధర్మశాస్త్రము. స్వభావ సిద్ధముగా పాపియైన మానవుడు పరిపూర్ణముగా ధర్మశాస్త్రము ప్రకారం జీవించలేడు. అయితే పాపి ఎట్లు ధర్మశాస్త్రము ప్రకారము నీతిమంతుడిగా తీర్చబడగలడు? క్రీస్తు ద్వారా లభించు పాపక్షమాపణ ద్వారా మాత్రమే పాపియైన మనుష్యుడు దేవుని యెదుట నీతిమంతుడిగా మార్చబడును. అనగా మనుష్యునికి యేసుక్రీస్తు అనుగ్రహించు పాప పరిహారము మూలముననే తప్ప స్వంత క్రియలచే ఎవరునూ నీతిమంతుడైన దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడలేరు. కనుక నీతిమంతులుగా తీర్చబడుట అనునది క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే లభించును. అంతేకానీ ధర్మశాస్త్రము వలనైన ఆచారముతో లభించదని పౌలు నిర్బంధముగా నిరూపించుచున్నాడు.

ముఖ్య పదజాలము:- దేవుని నీతి.

ముఖ్య వచనములు:- రోమీయులకు 1:6రోమీయులకు 1:17రోమీయులకు 3:21-25.

ముఖ్య అధ్యాయములు:- రోమా 6-8 వరకు క్రైస్తవ జీవిత పునాది బోధనలు యీ పత్రిక మధ్య భాగమైన 6-8 వరకు గల అధ్యాయములలో కనిపించుచున్నవి. పాపము నుండి ఎట్లు విడుదల లభించును? కృప ద్వారా శిరస్సావహించిన ఒక జీవితము మనకెట్లు లభించును? పరిశుద్ధాత్మతో నిండిన ఒక విజయ జీవితమును ఎట్లు స్వంతము చేసుకొనగలము? ఈ ప్రశ్నల యొక్క సమాధానమును యీ భాగమందు చూడగలము. యేసుక్రీస్తు యొక్క పోలికలో రూపాంతరము పొందుటను గూర్చిన అతి ముఖ్యమైన లేఖన భాగము ఇదేనని అనేకులు తలంచుచున్నారు.

గ్రంథ విభజన:- దేవుని నీతియనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య అంశము. ఈ నీతిని గూర్చిన మూడు కార్యములు వరుస క్రమమున యీ గ్రంథము నందు వివరించబడియున్నవి. (1) దేవుని నీతి ప్రత్యక్షత. ఆధ్యా1-8 వరకు. (2) దేవుని నీతి నిరూపించబడుట. ఆధ్యా 9-11 వరకు. (3) దేవుని నీతి యొక్క అనుచరణ అభ్యాసము 12-16 వరకు.

కొన్ని ముఖ్య వివరణలు :- పరిశుద్ధ గ్రంథము యొక్క 45వ పుస్తకము: అధ్యాయములు 16; వచనములు 433; ప్రశ్నలు 87; పాత నిబంధన ప్రవచనములు 19; క్రొత్త నిబంధన ప్రవచనములు 4; చారిత్రక వచనములు 388; నెరవేర్చబడిన ప్రవచనములు 29; నెరవేర్చబడని ప్రవచనములు 16.


Share this post