Skip to Content

రాజులు మొదటి గ్రంథము

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను రాజు పరిపాలన, ఆయన గొప్ప కార్యములను గురించి ఈ గ్రంథము యొక్క మొదటి భాగము చెప్పుచున్నది. సొలొమోను పరిపాలనా కాలము ఇశ్రాయేలు రాజ్యపు స్వర్ణ యుగముగా ఉండినది. శిల్పకళలో శ్రేష్టమైన గుర్తుగా యెరూషలేము దేవాలయము కట్టబడినది. అతని పాలనలో ఇశ్రాయేలు మహిమ చేరినది. దీనిని సొలొమోను యొక్క శ్రేష్టమైన కార్యముగా చెప్పవచ్చును. ప్రతి దినము రెండు లక్షల మంది పనివారు ఏడు సంవత్సరములు పనిచేసి ఈ దేవాలయమును కట్టిరి. గొప్ప జ్ఞానియూ, కవియూ అయిన సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకును, ఆయన అంతఃపురము యొక్క మహాత్యమును చూచుటకు పలు దేశముల నుండి రాజులు, రాణులు యెరూషలేముకు వెళ్ళుట ఆనాటి అలవాటుగా ఉండినది.

     అయినప్పటికి ఆయన వృద్ధాప్యము ఒక దుఃఖకరమైన స్థితికి సాక్ష్యమిచ్చినది. ప్రజల మధ్యలో అసంతృప్తి ఏర్పడినది. దేశములో విభజనలు, అంతర్గత కలహములు పెరిగినవి. మహిమ కలిగిన దేశము అతి త్వరగా చిన్నాభిన్నమైనది. ఈ నాశనమునకు కారణములు ఏమిటి అనేది చూద్దాం.

     (1). ఆడంబర జీవితము, అనవసరమైన ఖర్చులు పెరిగి ప్రజలకు భారమాయోను. (2). రాజులందరు తమ నైపుణ్యము వలన జయించుటకు చేసిన ప్రయత్నముల మధ్య దేవుని కేంద్ర బిందువుగా చేయడం సొలొమోను మరచినాడు. (3). ఆయన వివాహ జీవితము సుఖభోగము యెక్క గుర్తుగా ఉండినది. ఆయన అంతఃపురంలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేవారు. ఆయన యొక్క అన్యులైన భార్యలు ఆయనను విగ్రహారాధనలోకి లాగిపడవేసిరి.

     మహిమతో నిండిన యెరూషలేము దేవాలయమును కట్టిన రాజు విగ్రహారాధికునిగా మారుట ఎంత దుఃఖకరము. అయిననూ సొలొమోను జీవితములో ఇదే సంభవించినది.

ఉద్దేశ్యము : ఇశ్రాయేలు మరియు యూదా రాజుల చరిత్రను చెప్పుటతోబాటు, దేవుని ఆజ్ఞలు గైకొని నడుచువారిని, వాటిని మీరి నడచువారిని పోల్చి చూపించుట.

గ్రంథకర్త పేరు : యిర్మీయా

నేపథ్యము: ఇశ్రాయేలు దేశము విభజింపబడుచున్నది. లోక పరిస్థితిలో మాత్రము కాక, ఆత్మీయ స్థితిలోనూ వేరుపరచబడినది.

ముఖ్యవచనములు : 1 రాజులు 9:4-5

ముఖ్యమైన వ్యక్తులు : దావీదుసొలొమోనురెహబాము, యరొబాము, ఏలియా, ఆహాబు, యెజెబెలు.

ప్రత్యేకత : మొదటి, రెండవ రాజులు రెండూ కలిసి ప్రారంభములో ఒకే పుస్తకముగా ఉండినవి.

కాలము : క్రీ.పూ. 722 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యము ఆషూరు చెరకు, క్రీ. పూ. 586 సంవత్సరంలో యూదా రాజ్యము బబులోను చెరకు తీసికొనిపోబడుటకు కారణం లోబడకపోవడం, విగ్రహారాధన, చెడునడత అనునవే అని వివరించే అక్షరచిత్రముగా రాజుల పుస్తకములలో గోచరమగుచున్నవి. సొలొమోను రాజ్యమునకు వచ్చిన క్రీ. పూ. 970 నుండి అహజ్యా యొక్క పాలన ముగిసిన క్రీ. పూ. 853 వరకు ఉన్న 123 సంవత్సరాల చరిత్ర మొదటి రాజులు పుస్తకపు విషయ సూచికమగును. ఈ పుస్తకము క్రీ.పూ. 930 సంవత్సరమును గమనించేటట్లుగా చేయుచున్నది. సొలొమోను మరణించుటతోడనే దేశము రెండుగా విడిపోవుట ఈ సంవత్సరములోనే జరిగినది.

     మహా గొప్ప జ్ఞానియూ, రాజకీయ చతురుడైన సొలొమోను వృద్ధాప్యములో ఒక బుద్దిహీనుడుగా ప్రవర్తించడం మనము చూస్తున్నాము. దీనిని బట్టి దేవుడు ఇశ్రాయేలు నుండి 10 గోత్రములను తీసి ఆయన సేవకుడైన ఇంకొకరికి ఇచ్చెను. పన్నును తగ్గించమని అడిగిన ప్రజలకు కఠినమైన జవాబు ఇచ్చిన రెహబాముకు రెండు గోత్రములు మాత్రమే ఇవ్వబడినవి. యూదాబెన్యామీను గోత్రములే అవి. తక్కిన 10 గోత్రములు యరొబాముతో కలిసి ఉత్తర ఇశ్రాయేలు దేశముగా ఏర్పడినవి. అది ఆయనకు, అనుచరులకు సొంతమైనది.

గ్రంథ విభజన : ఈ పుస్తకమును తేటగా రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును.

  1. ఒకటిగా కలిసిన ఇశ్రాయేలు దేశము (1 - 11 అధ్యా వరకు). 2. విడిపోయిన దేశము - ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ప్రాంత యూదా (12 - 22 అధ్యా వరకు)

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 11వ పుస్తకము; అధ్యాయములు 22; వచనములు 816; ప్రశ్నలు 66; నెరవేరిన ప్రవచనములు 71; నెరవేరని ప్రవచనము 1; దేవుని సందేశములు 36; ఆజ్ఞలు 92; హెచ్చరికలు 73; వాగ్దానములు 6.


Share this post