- Author: Sajeeva Vahini
- Category: Bible Study
- Reference: Sajeeva Vahini
మాయ (వ్యర్ధము) అనునదే ఈ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము. 37 సార్లు మరల, మరలా ఈ మాట ఈ గ్రంథములో వచ్చుచున్నది. దేవుడు లేని జీవితములో తృప్తిని కనుగొనుటకు వ్యర్థముగా ప్రయాసపడుటయే ఈ పదము గుర్తించుచున్నది. ప్రసంగి అనగా సొలొమోను ఇశ్రాయేలీయుల చరిత్రలోనే ఎంతో గొప్ప జ్ఞానము గలవాడును, శ్రీమంతుడును, ప్రఖ్యాతి గాంచిన రాజుగా నుండెను. ఆయ సూర్యుని క్రిందనున్న సమస్తమును మానవ దృష్టితో చూచెను. అప్పుడన్నియు వ్యర్ధమైనవని చూచుచున్నాడు. మానవ హృదయములో దేవుడు ఉంచిన ఒక ఖాళీ స్థలమున్నది. దేవుడు తప్ప వేరే ఏదియు ఆ స్థలమును నింపవీలుపడదు. అధికారముగాని, పేరు ప్రతిష్టలుగాని, ఆస్థిగాని సుఖముగాని, ప్రఖ్యాతిగాని దానిని ఏమాత్రము నింపలేదు. దేవుని దృష్టితో దాని విలువను లెక్కించునపుడు జీవితానికి, లక్ష్యము, అర్థమ ఉన్నది. అప్పుడు తినుట, త్రాగుట, ఆనందించుట, మేలుచేయుట, దేవునికి భయపడుట మొదలైనవన్నియు ఎంతో విలువైనవిగా లెక్కించబడుచున్నవి. ప్రతి దినము మన జీవితమును దేవుడు అనుగ్రహించే ఒక ఈవి అని తలంచునపుడు సూర్యోదయములో మంచు మరుగైనరీతిగా నిరాశలన్నియు మరుగైపోవును. హెబ్రీభాషలో ఈ గ్రంథము యొక్క పేరు “గొహేలేత్ ” అనబడును. ఒక సంఘములో ప్రసంగించువాడు అని దీని అర్ధము. గ్రీకు పదమైన “క్లీసియాస్టెస్" అను మాటకు కూడ ఇదే అర్థము. ఈ విధముగా తెలుగులో ప్రసంగి అను పేరు పెట్టబడియున్నది.
గ్రంథకర్త : సొలొమోను
కాలము : సొలొమోను యొక్క అంత్య దినములలో దాదాపుగా క్రీపూ 935 లో
ముఖ్య మాట : వ్యర్ధము ( 37 సార్లు)
ముఖ్య వచనము : ప్రసంగి 2:24; Ecc,12,13,14
ముఖ్య అధ్యాయములు : ప్రసంగి 12
గ్రంథము యొక్క చివరి భాగమునకు ప్రవేశించబోవుచున్నప్పుడు ప్రసంగి దైవ దృష్టి ద్వారా జీవితమును చూచుచున్నాడు. అయితే అంతకుముందు సూర్యుని క్రిందనున్న సమస్తమును బౌతిక కండ్లతో అతడు చూచెను. అప్పుడు ఆయనకు సమస్తము నిష్ప్రయోజనమైనవిగా అర్థశూన్యముగా నుండినవి. అయితే సూర్యునికి పైగా ఉన్న దేవుని దృష్టితో జీవితమును చూచినపుడు దేవుని ఈవిగా దానిని ఎంచుటకు, అన్నియు యథార్థమైనవిగా, మేలుకరమైనవిగా ఉన్నవని గ్రహించగలిగెను.
జీవితము యొక్క ముఖ్య సంకల్పము ఏమని ఆయన వెదకినపుడు కనుగొన్న జవాబే 12వ అధ్యాయము దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి (ప్రసంగి 12:13) అను గమ్యమునకే ప్రసంగి వచ్చి చేరెను.
గ్రంథవిభజన : మానవ జీవత ఉద్దేశము ఏమి అని కనుగొనుటకు గ్రంథకర్త జరిగించిన ధీర్ఘమైన అన్వేషణయే ఈ గ్రంథము యొక్క సారాంశము. ఈ గ్రంథమును మూడు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.
- సమస్తము వ్యర్ధము అనునది Ecc,1,1-1,11 వరకు
- వ్యర్ధము అను ఉద్దేశము యొక్క ఆదారములు Ecc,1,12-6,12 వరకు
- వ్యర్ధమును జయించి జీవించుటకు బోధన Ecc,7,1-12,14 వరకు
దేవునియందలి భయభక్తులు కలిగి జీవించే మార్గమే శ్రేష్టమైన జీవితమును సంపాదించుకోగలదు అను తీర్మానమునకు ప్రసంగి చేరుకుంటున్నాడు. దేవునిని, దేవుని చిత్తమును, విలువైనదిగా ఎంచని వారి జీవితము అపాయములోను, భయంకరమైన అపజయములోను జారిపడుచున్నది. ప్రతి సమస్యకు పరిష్కారము కనుగొనేంత వరకు జీవితము ఎవరి కొరకును వేచియుండడములేదు. అయితే సూర్యునికి
క్రింద చూచుటకు బదులుగా సూర్యుని పైగా ఒకే కాపరిని తొంగి చూచుట ద్వారా జీవిత రహస్యమునకు జవాబులు దొరుకును. అప్పుడది అర్థవంతమైనదిగాను, సంతోషకరమైనదిగాను పరిగణంచబడుట నిశ్చయమే.
కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 21వ గ్రంథము ; అధ్యాయములు 12; వచనములు 222; ప్రశ్నలు 33; ఆజ్ఞలు 34; ప్రవచనములు లేవు; వాగ్దానములు 1; దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.