Skip to Content

ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Vijaya Kumar G
  • Category: Bible Study
  • Reference: Revelations Detailed Study

<< Previous - Revelation Chapter 2 వివరణ

ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే

సార్దీస్ అనగా శేషము మరియు ఉజ్జీవము అని అర్ధమిచ్చు పదునాలుగవ శతాబ్ద కాలమునాటి సంస్కరణల సంఘము. సంస్కరణల సంఘము అనగా లోకరీత్యా ఘనమైన సంఘముగా ఎదుగుతూ, ఆత్మీయముగా కొంత వెనుకబడిన సంఘము. ఆత్మీయ ఉజ్జీవ జ్వాలలు తగ్గుముఖం పట్టాయి.

ఏడు నక్షత్రములు అను అంశమును ప్రకటన 1:16 లో ధ్యానించుకున్నాము. దేవుని యేడు ఆత్మలు అను మాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యను త్రిత్వములో విలసిల్లుతున్న మహిమను చూపించుచున్నది. (అ). తండ్రి సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు (ప్రకటన 4:5), (ఆ). కుమారునిలో ప్రత్యక్షపరచబడిన i.యెహోవా (తండ్రి) ఆత్మ ii.జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ iii.వివేకములకు ఆధారమగు ఆత్మ iv.ఆలోచనకు ఆధారమగు ఆత్మ v.బలములకు ఆధారమగు ఆత్మ vi.తెలివిని పుట్టించు ఆత్మ vii.యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.

నేనెరుగుదును అను దేవుని మాటను ప్రకటన 2:2,3 లో ఎఫేసు సంఘము ఆధారముగా ధ్యానించి యున్నాము. జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది - అనుమాట నేటి మన నామకార్ధ క్రైస్తవ జీవితమును చూపించుచున్నది. అంత్యదినములలో.... పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు (2 తిమో 3:5) అను వాక్యమునకు సరిపోయినవారము.

గాని నీవు మృతుడవే –క్రీస్తు యేసు చెప్పిన ఒక ఉపమానము జ్ఞాపకము చేసుకున్నప్పుడు థప్పిపొయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని స్థితిని చూచి; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను (లూకా 15:24). సంఘము అనుసరిస్తున్న విధానము యేదైనా సరియైనదిగా లేదని ప్రభువు బయలుపరచినప్పుడు, ఆ విధానమును అవలంబించుట మానివేయాలనో, మార్చివేయాలనో నిర్ణయిస్తారు. కాని దానిని వెంటనే అమలు పరచడానికి వెనుకంజ వేస్తారు. ఇంకా కొంత కాలము వేచిచూద్దాము, ఇప్పుడప్పుడే వద్దులే, లేకుంటే రెండూ ఉండనీ; అది ఇదీ అన్నీ కలిపివేస్తారు. దానినే జీవన్మరణముల మధ్య స్థితి అంటున్నారు ప్రభువు.

సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును (1 తిమో 5:6). మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకే వలెననియే (1 తిమో 2:1) ప్రభువు కోరుతున్నారు. కాని సుఖభోగములు అనుభవించు స్థితి మృతమైన దని హెచ్చరిక. సుఖము వేరు, సుఖభోగము వేరు. అట్టివారు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారునై యుందురు (2 తిమో 3:4).

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు (ఎఫే 5:14). యేసు : నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను (యోహా 5:24).

అవును, అట్లు విశ్వసించిన అబ్రహాము అనుభవము మనకు ఏమి జ్ఞాపకము చేయుచున్నది? విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడిన అతడు మృతతుల్యుడైననూ; ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను (హెబ్రీ 11:12).

ప్రియ స్నేహితుడా, అద్దములో తన సహజముఖమును చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోయిన (యాకో 1:23) వానివలె ఉండక, సరిచేసుకోనుటకు ప్రభువు తరుణము యిస్తున్నాడని గ్రహించి మారుమనస్సు పొండుమని సడలని విశ్వాసములో బలపడి స్థిరపడి ఆత్మీయ జీవము పొందునట్లు ప్రభువు కృప మనకు తోడై యుండునుగాక. ఆమెన్

 

ప్రకటన 3:2 నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.

క్రియలు రెండు రకములుగా వున్నట్లు ప్రభువు తెలియజేయుచున్నారు, సంపూర్ణమైనవి, అసంపూర్ణమైనవి. అంటే, లోపభూయిష్టమైన క్రియలు కూడా సంఘములో వున్నాయి అని అర్ధమౌతున్నది. క్రమము తప్పక కూడికలకు హాజరగుట, రోజూ వాక్యము చదువుట వంటి ఒక క్రమబద్ధమైన అలవాట్లు సరిపోవు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు (రోమా 3:20). విశ్వాసము, ప్రేమ లోపించిన పరిచర్య మృతమైనది. అట్టి లోపములున్న క్రియలు చావనైయున్నవి అంటున్నారు ప్రభువు.

ఎప్పుడు ఆత్మ సిద్ధమై శరీరము బలహీనమౌతుందో (మత్త 26:41), అప్పుడే దేవుని కార్యములు అసంపూర్ణముగా మిగిలిపోతాయి.. మరియు ప్రభువు రాకడ ఇప్పుడే కాదులే అను ఆలోచన సైతం సిద్ధపాటుకు భంగము కలిగిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు; ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు (మార్కు 13:35) అని చెప్పారు. ప్రియ స్నేహితుడా, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి (మార్కు 13:36).

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు (ఎఫే 5:140. ఐతే నీవు లోపముగా ఉన్నవాటిని దిద్డుము (తీతు 1:5) లేక బలపరచుము అని వాక్య హెచ్చరిక. కనుక సంఘములో జాగరూకత ఎంతో అవసరమై యున్నది. అట్లు లేనియెడల ప్రియ సంఘ కాపరీ, నీ క్రియలు మాత్రమే కాదు, నీవు కాయుచున్నగొర్రెలు సైతం చనిపోతాయి, ఆపై నీవు పొందబోవు శిక్ష గొప్పది. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును (జక 11:17).

తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బల పరచును (1 పేతు 5:10). ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు (1 పేతు 5:8).

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి; ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు (1 పేతు 5:3,4). ఆమెన్

 

ప్రకటన 3:3 నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

నీవు పొందిన ఉపదేశము అనగా నీవు క్రీస్తు సువార్త వర్తమానము ఎలా విన్నావు? విని ఏమి మార్చ బడినావు? మారుమనస్సు పొందిన రోజు నీవు తీసుకున్న తీర్మానము ఏమిటి? ఇప్పుడున్న స్థితి ఏమిటి? మనము ప్రకటన 3:2లో ధ్యానించు కున్న ప్రకారము మృతవిశ్వాసములోనికి జరిపోయినట్లితే ప్రియుడా మరలా మారుమనస్సు పొందు సమయమిదే.

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు[మనకు] బాగుగా తెలియును (1 థెస్స 5:2). ప్రియ దేవుని బిడ్డా, ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును (సామె 29:1) అను మాటను జ్ఞాపకము చేసుకొనుమని ప్రభువు పేరిట బ్రతిమాలు చున్నాను.

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధమును (కొల 2:6), మీరు నేర్చుకొనిన ప్రకారముగా (కొల 2:7), విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు (హెబ్రీ 12:2) ముందుకు సాగుదము. పరిశుద్ధాత్మ దేవుడు మనతోను మన ఆత్మలతోనూ ఉండును గాక.

జాగరూకత ఎంత అవసరమో ముందు వచనములో అనగా ప్రకటన 3:2లో ధ్యానించియున్నాము. అపో. పౌలు గారు తిమోతి కి వ్రాస్తూ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విష యము తప్పిపోయిరి.

కృప మీకు తోడైయుండును గాక (1 తిమో 6:20,21). క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవారమై మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుదుము గాక. ఆమెన్

 

్రకటన 3:4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

సార్దీస్‌లో కొందరు (అందరు కాదు) వస్త్రములు అపవిత్రపరచుకొనలేదు, వారు అర్హులు, వారికి పరలోకములో తెల్లని వస్త్రములు యివ్వబడతాయి, వారు ప్రభువుతో కలిసి సంచరించుతారు. ప్రియ స్నేహితుడా, సంఘములో ఉన్న అందరిలో నీవున్నావు, నేనున్నాను; మరి ఆ కొందరిలో వున్నామా?

అనేక సార్లు తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల విషయమై ఒక సందర్భములో ఏలీయాతో దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియున్నారు (1 రాజు 19:18). అర్హత వున్నా లేకున్నా దేవుడు మనల్ని జీవముగల ఆత్మీయ సంఘములో యింకా వుండనిస్తున్నాడంటే, కారణం ప్రవక్తయైన యెషయా వివరిస్తన్నాడు: సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము (యెష 1:9).

ప్రియ దేవుని పిల్లలారా, అపవిత్రపరచుకొనని వస్త్రములను ధరించిన వారముగా వున్నామా? కొందరిని గూర్చి యెష 64:6 ఏమంటున్నది; మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను అంటున్నది. ఇంకొందరిని గూర్చి ప్రక 19:8 ఏమంటున్నది; ఆమె [సంఘ వధువు] ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. వీరు అర్హులు, క్రీస్తుతో నిత్యత్వములో సంచరిస్తారు.

గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనినవారు (ప్రక 7:14). ప్రక 3:5 ప్రకారము జీవ గ్రంధములో వారి పేరులు వ్రాయబడి వుంటాయి, ప్రక 4:4 ప్రకారం వారు సువర్ణ కిరీటములు ధరించి ప్రక 7:9 ప్రకార్రము ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్లఎదుటను నిలువబడి వుంటారు.

వీరిద్వారా సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

 

ప్రకటన 3:5 జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.

ప్రకటన 3:6 సంఘములతో ఆత్మ చెప్పు చున్న మాట చెవిగలవాడు వినునుగాక.

జయించు వారు అనగా ఎవరో ప్రక 2:7 ప్రకారము ఎఫేసు సంఘ ధ్యానములో నేర్చుకొని యున్నాము. తెల్లని వస్త్రములు ధరించుకొను వారిని ముందు వచనములో అనగా ప్రకటన 3:4 లో ధ్యానించు కున్నాము.

జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక – అనగా అప్పటికే వారి పేరులు జీవ గ్రంథములో వ్రాయబడి యున్నవి అని గ్రహించవలెను. ఒకసారి యేసు ప్రభువని ఒప్పుకొని, పాప క్షమాపణ పొంది, మారుమనస్సు అనుభవము లోనికి వచ్చి, క్రైస్తవునిగా జీవించడానికి నిర్ధారించుకొని, బాప్తిస్మము తీసుకుని, ఒక సంఘముతో ఏకీవభవించిన తరువాత మళ్ళీ తప్పిపోయినా దేవుడు విడిచిపెట్టడు అని భావించు వారిని నేనెరుగుదును.

వారేమంటారంటే, గాఢాంధకారపు లోయలో [పాపములో పడిపోయిననూ] నేను సంచరించినను ... నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును (కీర్త 23:4) అను వాగ్దానము మనకున్నది అంటారు. అంతే కాదు, దేవుడు అనుకుంటే; బాప్తిస్మము సంఘము ఏవీ లేని దొంగను సిలువ మీది క్రీస్తు నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువు (లూకా 23:43) అని చెప్పలేదా అంటారు. మరో అడుగు ముందుకు వేసి; పిలువబడిన వారు అనేకులైనా, ఏర్పరచబడినవారు కొందరు (మత్త 22:14) వుంటారు, వారిని దేవుడు విడిచిపెట్టడు అనుకుంటారు.

ప్రియ స్నేహితుడా, ఈ వచనము అనగా ప్రకటన 3:5 ధ్యానించుచున్న మనతో ప్రభువు ఏమి మాటాడుతున్నారు? దేవుని సమక్షములో వున్న జీవ గ్రంధములో ఒకసారి ఒక వ్యక్తీ పేరు వ్రాయబడిన తరువాత కూడా అది తుడుపు పెట్టబడగలదట. ఇశ్రాయేలీయుల పక్షముగా మోషే మొరపెట్టి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొను చున్నాననెను (నిర్గ 32:32). అందుకు యెహోవా యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును (నిర్గ 32:33) అనెను.

ఈ మర్మము గొప్పది, యేలయనగా దేవుని సన్నిధిలో ఒక గ్రంధము ఎప్పటినుండి వ్రాయబడు చున్నది అనే విషయము నాడే మోషేకు దర్శనమున్నది. ఏ శిశువు తన తల్లి గర్భములో వూపిరి పోసుకున్నాడో, ప్రాణము వచ్చునట్లు ఆ బిడ్డలోనికి ఎప్పుడు జీవాత్మ ప్రవేశించిందో అప్పుడే ఆ బిడ్డ పేరు ఆ గ్రంధములో వ్రాయబడుచున్నది, నిర్గ 32:33 ప్రకారం పాపము చేసినప్పుడు అది తుడిచివేయ బడుచున్నది.

అపో. పౌలు ఫిలిప్పీయులకు పత్రిక వ్రాస్తూ, సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారి పరిశుద్ధుల పేరులు జీవగ్రంధమందు వ్రాయబడి యున్నవి (ఫిలి 4:3) అన్నారు. నా సహవిశ్వాసీ, నా ఆత్మీయ సహకారీ, నీ పేరులు సంఘపు పుస్తకాలలోనో, మందిరం కట్టేప్పుడు పెద్దమొత్తంలో ఇచ్చిన దాతలు అంటూ ఒక శిలాఫలకం మీదనో లేక నీవో నేనో మొక్కుకొని మందిరానికి ఇచ్చిన ఫంకా మీదనో, ప్లాస్టక్ కుర్చీల మీదనో, ఖరీదైన బీరువా మీదనో వ్రాయించు కుంటున్నావా? అది నీకు ఆశీర్వాదకరమూ కాదు, దేవుని ఏమాత్రమూ మహిమ కరమూ కాదు, ఏలయన శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు (రోమా 8:8).

జీవ గ్రంధములోనుండి నీ పేరు తుడుపుపెట్టబడక ముందే నీ మందిరములో వ్రాయించుకున్న పేరులు తుడిపించుకో. మోకరించు, ప్రార్ధించు, ఈ రోజే నీ పేరు జీవగ్రంధములో మళ్లీ వ్రాయించుకో. యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో ఆత్మయు మనకు సహాయము చేసి నడిపించును గాక. ఆమెన్

దూతల యెదుటను మన పేరు ఒప్పుకొనుటను గూర్చి పెర్గములో వున్నసంఘమును ధ్యానించినపుడు ప్రకటన 2:17 (b) అంశములో చూచియున్నాము. సంఘములతో ఆత్మ చెప్పు చున్న మాటను ప్రక 2:7ను ఆధారము చేసుకొని ముందుగానే సంపూర్ణముగా ధ్యానించి యున్నాము. అందుకు ప్రభువుకు వందనములు, చదువుతున్న నీకు నా హురుదయపూర్వక శుభాశీస్సులు. ఆమెన్

 

ప్రకటన 3:7 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతులేవనగా

క్రీ.శ. 17 వ శతాబ్ద కాలము నాటి ఫిలదెల్ఫియలో ఉన్న సంఘమును మాదిరిగా చూపుతూ దేవుడు మాటాడుతున్న అంశాలు ముందు ధ్యానించిన ఐదు సంఘాలకు పూర్తిగా భిన్నంగా వున్నట్లు గ్రహించాలి మనము. యేసు సత్యస్వరూపి, పరిశుద్ధుడు, తన సార్వభౌమాదికారమును సూచించు తాళపు చెవి కలిగినవాడు, యెవడును వేయలేకుండ తీయగల వాడు, ఎవడును తీయలేకుండ వేయగల వాడు, అని తనను గూర్చి వ్రాయమని యోహానుతో చెబుతున్నారు.

తండ్రియైన దేవుడు తన అసామాన్యమైన శక్తి, ప్రభావ మహిమలను వెల్లడి పరుస్తూ; నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే ...... నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?( యెష 43:11-13) అన్నారు.

దావీదు యెహోవా దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడే (1 సమూ 13:14) ఐనా, మందిరమును కట్టించి దేవుని నివాస స్థలమగునట్లు దాని ప్రతిష్టించి ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలని దేవుని అందుంచి తాళము వేయగలడా!!

ప్రియ స్నేహితుడా, మందిరమునకు తాళము వేయుటకే శక్తి చాలని అల్పుడైన ఒక మనిషికి యేసు క్రీస్తు అను మన రక్షకుడు పేతురుతో సంఘమును గూర్చిన వాగ్దానము ప్రకటిస్తూ; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను (మత్త 16:18, 19).

దావీదు తాళపుచెవి అనియూ, పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు అనియూ వ్రాయబడిన మాటల మర్మము ఎరుగుట ఒక విశ్వాసికి, (మన) సంఘమునకు అనుగ్రహించబడి యున్నది. దేవుడు దావీడుతో చేసిన ప్రమాణమును బట్టి లేక నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును (2 సమూ 7:16 ) అని ఇచ్చిన వాగ్దానమును బట్టి దావీదు తాళపుచెవి అని ఆత్మ సంఘముతో చెప్పుచున్నది. అది దేవుని రాజ్యము యొక్క నిత్యత్వమును చూపించు చున్నది.

ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది (కొల 2:17) అని మనము గ్రహించవలెను. పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు (మనకు) అనుగ్రహింపబడియున్నది (మత్త 13:11), అందును బట్టి మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును గాక. ఆమెన్

 

ప్రకటన 3:8 నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు

నీ క్రియలను నేనెరుగుదును అనుట సార్దీస్ సంఘ లేఖలో ప్రక 2:2,3 వచనముల ద్వారా ధ్యానించి యున్నాము. ఇహలోక శక్తి హీనమై, ఆత్మీయ శక్తి బలీయమై వాక్యమును ఆస్వాదిస్తూ చేస్తున్న పరిచర్య ఎంత మహిమ కరమైనదో, అది దేవుని మెప్పు ఎలా పొందగలదో తెలుసుకుందాము.

ప్రభువు తన దాసుడు అపో. పౌలు భక్తునీతోను, అపో. పౌలు ప్రభువుతోను పరస్పర సంభాషణలా కనిపించే వాక్య భాగము చూద్దాము : నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. (2 కొరిం 12:9). నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్న ఈ మాటలు నన్ను నిన్ను బలపరచుటలేదా.

సంఘము చిన్నదా, పేదదా, మందిరము ఇంకా పాకలోనే వున్నదా, ప్రియ స్నేహితుడా ప్రియ సంఘ కాపరీ రక్షణ కలుగజేయు ఆయన నిత్యశక్తిని, పరిపూర్ణమగు క్రీస్తు శక్తిని, పరిశుద్ధాత్మశక్తిని పొంది ముందుకు సాగుము. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది (1 కొరిం 4:20). ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు (ఎఫే 6:16).

దావీదు తాళపు చెవి కలిగినవాడు, యెవడును వేయలేకుండ తీయగల వాడు, ఎవడును తీయలేకుండ వేయగల వాడు వాగ్దానము చేయుచున్నాడు; పరలోకములో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను. మన గమ్యం పరలోకం. ఆ గమ్యం చేరుకోవటం తద్యం. ఈలోక శక్తియైనను ఆపదయైనను శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను మరేదిగాని మనలను ఆటంక పరచలేదు.

ఇనుప గొలుసులు, ఇత్తడి ఘడియలు పగులగొట్టగల శక్తిమంతుడును, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో బహుమానము పొందునట్లు ఓపికతో పరుగెత్తుదము. ప్రభువు ఆత్మ మనలను నడిపించునుగాక. ఆమెన్

 

ప్రకటన 3:9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.

యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు వారిని, సాతాను సమాజపు వారిని మనము స్ముర్న సంఘ ధ్యానములో జ్ఞాపకము చేసుకున్నాము. ఐతే, వారిని రప్పించెదను, నీ పాదముల యెదుట నమస్కరింప చేసెదను అని ప్రకటిస్తున్నారు ప్రభువు. అందుకుగల రెండు కారణములు మనకు స్ఫురిస్తూ వున్నవి.

మొదట సంఘము దేవుని వాక్యముపై సంపూర్తిగా ఆధార పడియుండుట. అలాంటి అనుభవము గల రోమా సంఘమునకు పౌలు భక్తుడు తన పత్రికలో : సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక (రోమా 16:20) అని వ్రాస్తున్నారు.

రెండవ కారణము ప్రభువు తెలియజేస్తున్న దేమంటే, ప్రభువు సంఘమును ప్రేమించుచున్నట్లు సాతాను తెలిసికొనవలెనని. స్వశక్తి మీద ఆధారపడక, పూర్తిగా ప్రభువును ఆనుకొని పరిశుద్ధాత్మ శక్తితో సంఘమును నడిపించుకుందాము. సాతాను ఎక్కడ నుండో రాదు ప్రియ సోదరీ సోదరుడా. మనలోనే కొందరు ఇస్కరియోతులుంటారు. ఐనా సంఘమును వారేమీ చేయలేరు.

ఏలయన, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు (మలా 4:3). అపజయము పాలైన సాతానుపై అధికారము అనుగ్రహించిన యేసయ్యకు తరతరములకు స్తోత్రము కలుగునుగాక.

ఆయన [యేసుసాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు (లూకా 10:18,19) అను సుస్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక (1 కొరిం 15:57). ఆమెన్

 

ప్రకటన 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.

ఓర్పు విషయమైన వాక్యమును గైకొనుట నేటి దినములలో చాలా కష్టం. ఎందుకనగా, అది దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును కలిగి వాక్యమును అంగీకరించుట. యేసు : నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు (యోహా 14:21). అలా అంగీకరించక పోవడానికి కారణం కేవలము శోధనలే. అందుకే యేసయ్య మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి (మత్త 26:41) అన్నారు.

శోధనలు అనగానే యేదో తెలియని భయం మనకు. సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మనకు సంభవింపలేదు, సంభవించదు. ఒకవేళ సంభవించినా దేవుడు నమ్మదగినవాడు; ఒక విశ్వాసి సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయు వాడు (1 కొరిం 10:13).

వాక్యము గైకొనుటకు, శోధనలకు ఏమిటి సంబంధము అంటే; భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలమున్నది అని, ఆ శోధన కాలములో నేను కాపాడెదను అని ప్రభువే వాగ్దానము చేయుచున్నాడు. అందుకు దేవునికి స్తోత్రము. లూకా 21:16, 17 ప్రకారము చూస్తే, తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు; నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. ఆమెన్

మన పితరులు ఇగుప్తు నుండి బయలుదేరిన దినమున; మీరున్న యిండ్లమీద ఆ రక్తము [యేసు రక్తము] మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను (నిర్గ 12:13). ప్రియ సోదరుడా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. (యోహా 6:54) అను వాక్యముల భావమేమిటి, ఆలోచన చేద్దాం.

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు (శోధనలను జయించుటకు) శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి (ఎఫే 6:13-17). ఆమెన్

ప్రకటన 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

నేను త్వరగా వచ్చుచున్నాను (ప్రక 3:11), ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను (ప్రక 22:7), ఇదిగో త్వరగా వచ్చుచున్నాను (ప్రక 22:12), అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్ (ప్రక 22:20). అంతిమ ప్రవచన గ్రంధం, ప్రకటన గ్రంధం. ఈ ఒక్క గ్రంధం లోనే ప్రభుని రాకడ హెచ్చరిక మనకు నాలుగు సార్లు కనబడుచున్నది.

యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? (ఆది 18:17) అని పలికిన దేవుడు నాడే ప్రవక్తయైన జేఫన్యా ద్వారా సెలవిచ్చినది యేమనగా; యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహా నాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము (జెఫ 1:14,15).

ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రికలో అపో. పౌలు; ప్రభువు సమీపముగా ఉన్నాడు (ఫిలి 4:5) అనియూ, సకల దేశములలో చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి లేఖ వ్రాస్తూ, అపో. యాకోబు; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు (యాకో 5:9) అనియూ హెచ్చరిస్తున్నారు.

ప్రియ స్నేహితుడా, ఈ హెచ్చరిక వార్త మన ఆత్మలను సంధించుచున్నదా లేక చాలా సార్లు విన్న సంగతేలే అంటున్నదా? ప్రభువు వస్తున్నాడు అంటే మనకు తీరిక లేదు, ఎందుకంటే తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు వున్నాము (లూకా 17:28). మనము గనుక ప్రభువు వైపు తిరిగినామంటే, యింక దూరముగా ఉన్నప్పుడే తండ్రి మనల చూచి కనికరపడి, పరుగెత్తి ఎదురుగా వచ్చి మెడమీదపడి ముద్దుపెట్టుకొంటాడట (లూకా 15:20). ఈరోజే ప్రభువు వైపు మళ్ళుకొందామా.

నీకొరకు, నాకొరకు సిద్దపరచబడిన కిరీటమున్నది అంటున్నారు ప్రభువు. అది అపహరింప బడనీయకు నేస్తం. వాక్యము వినియు గ్రహింపక యున్నావంటే, దుష్టుడు వచ్చి నీ హృదయములో విత్తబడినదానిని యెత్తికొని పోతాడు (మత్త 13:19). పరిశుద్ధాత్మను మోసపుచ్చునట్లు సాతాను నీ హృదయమును ప్రేరేపించునేమో (అపో 5:3). మెలకువ గలిగి ప్రార్ధన చేద్దామా.

సంఘములో నీవోక్కడివే వున్నావా? నేనొక్కడినే వున్నానా? సంఘముతో నేను, నాతో సంఘమూ వున్నది కదా, అని ఆలోచించకు; పందెపు రంగములో పరుగెత్తువారు చాలా మంది వుంటారు, వారంతా పరుగెత్తుతారుగాని యొక్కడే బహుమానము పొందునని తెలుసుకో. ప్రియ దేవుని పిల్లలారా, బహుమానము పొందునట్లుగా పరుగెత్తుదమా (1 కొరిం 9:24). ప్రభుని కాపుదల, తోడు ఆయన తిరిగి వచ్చు వరకూ మనతో నుండును గాక. ఆమెన్

 

ప్రకటన 3:12 (1) జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు.

జయించు వారు అనగా ఎవరు? – అంటూ ప్రక 2:7లో ధ్యానించి యున్నాము.

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘమునకు దేవుడు చేసిన ఈ వాగ్దానము ఎంతో అద్బుతముగా వున్నది. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? (1 కొరిం 3:16) అనియూ, మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? (1 కొరిం 6:19) అనియూ అపో. పౌలుగారు తెలియ జేస్తూన్నారు. అపో. పేతురు గారు; మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు (1 పేతు 2:5) అని వ్రాస్తున్నారు.

ఈలోకములో ఆలయము వలే వున్నా, ఆ ఆలయమునకు రాళ్ల వలే వున్నా; భూమి మీద ఎన్నెన్ని ఆశీర్వాదములు అనుభవించినా, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు (హెబ్రీ 13:14) అనేది సత్యం. ఐతే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము వలె ఎదురుచూచున్నాము (హెబ్రీ 11:10). ఏలయన, మన పౌరస్థితి పరలోకము నందున్నది (ఫిలి 3:20).

ఆ పరలోకములో ఆ పునాదులుగల ఆ పట్టణములో దేవుని ఆలయము, ఆ ఆలయములో దేవుని నిబంధన మందసము వున్నాయి (ప్రక 11:19). ఆ ఆలయములో నుండి ఎన్నటికిని వెలు పలికిపోనీయక ఒక స్తంభముగా చేసి స్థిరపరచ వలెనని దేవుని ప్రణాళిక కనబడుచున్నది. సంఘము నడిపే ఒక సేవకుడే గాని, సువార్తికుడే గాని, విశ్వాసియే గాని; ఒక్కటే గమనించాలి. భూమిమీద దేవుని మందిరములో యేమేమి వుంటాయో అవన్నీ పరలోకములో వున్న నమూనాలకే సాదృశ్యములు అని గుర్తించాలి.

రాజైన సొలొమోను మందిరమును కట్టించినప్పుడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోయించాడు. ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించి; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను (1 రాజు 7:15-21). అపో. పౌలు గారి పరిచర్యలో తన సహచరులైన దేవుని పనివారిని అనగా యాకోబు కేఫా యోహాను అనువారిని తన పరిశుద్ధ పరిచర్యలో స్తంభములుగా ఎంచినట్లు గలతి పత్రిక 2:9 లో వ్రాస్తున్నాడు.

ఒకవేళ ఈ లోకములో మనలను మనుష్యులు ముఖ్యమైన వారినిగా ఎంచినా, అది పైరూపమును బట్టియే. గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టి (1 సమూ 16:7), తన వాగ్దానమును తప్పక నేరవేరుస్తాడు. కనుక ప్రియ సోదరుడా, నేడు నీవు నేను మనమున్న మందిరములో ఒక ఆత్మ స్థంభము వలే వుండిన ఎంత మేలు, దేవునికి ఎంత మహిమ. దేవుని మందిరములో ఒకసారి ప్రభువు పక్షముగా నిలబడిన తరువాత అందులోనుండి ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోరాదు. భూమి మీద అస్ధిరులు పరలోకంలో స్ధిరులు కాలేరు. దేవుడు ఆరీతిగా బలపరచి స్ధిరపరచును గాక. ఆమెన్

 

ప్రకటన 3:12 (2) మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.

మన ఆత్మకు రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరు పెట్టబడుతుంది; అది పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు. ఈ అంశమును పెర్గాములో వున్న సంఘపు దూతకు వ్రాయబడిన లేఖలోని - అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు (ప్రకటన 2:17) అను వాక్యముద్వారా ధ్యానించి యున్నాము.

ఇపుడు ఫిలదేల్ఫియా సంఘముతో మాటాడుతున్న యేసయ్య, నా దేవుని పేరును వ్రాస్తాను అంటున్నారు. పరలోక ఆశీర్వాదమును అనుగ్రహించుటకు ఆశించున్న దేవుడు ఇలా వ్రాయిస్తున్నారు. ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను (సంఖ్య 6:27) అని పలికిన దేవునికి మహిమ కలుగును గాక. ఆలాగు తన్ను అంగీకరించిన వారందరిని, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారిని, ఆయన తన పిల్లలని (యోహా 1:12) తెలియబడునట్లు తన పేరును వ్రాస్తాడు అనుటలో ఆశర్యము ఏముంది.

ఒక సంఘము మీదనే గాని ఒక ఆత్మ మీదనే గాని దేవుడు తన పేరును వ్రాసుకొనుట ద్వారా, ఇది నాది వా స్వంతము అని ప్రకటించినట్లు అవుతుంది కదూ! సృష్టికర్త యైన దేవుడు; నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు (2 కొరిం 6:16) అని పలికిన మాట జ్ఞాపకము చేసుకుందాము. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే (1 యోహా 3:1).

పునాదులు గల ఆ పట్టణపు పేరును వ్రాయుట అనగా మన శాశ్వత చిరునామా తెలుపబడుచున్నది. పరలోకములో దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన పరలోకపు యెరూషలేమను ఆ పట్టణపు పేరు యెహోవాయొక్క సింహాసనమనియూ (యిర్మీ 3:17) యెహోవా యుండు స్థలమనియూ (యెహే 48:35) అర్ధమిచ్చుచున్నది. అట్లు మన చిరునామా తెలుపబదుట ద్వారా, మన పౌరస్థితి బయలు పరచ బడుచున్నది (ఫిలి 3:20).

దేవుని యెద్దనుండి దిగివచ్చుట అనగా కన్యక సంఘము వధువుగా అలంకరింపబడి దిగుచున్నదని మనము ఎరుగవలసి యున్నది. వివాహిత యైన స్త్రీకి ఆమె పేరుకు తన యజమానియైన భర్త పేరును జోడించిన రీతిగా, ఈ నూతన ఎరుషలేము కు దేవుని పేరును చేర్చబడునని ఫిలదేల్ఫియాలో వున్న సంఘమునకు వర్తమానము. ప్రియ సోదరుడా, నీ సంఘము పేరు ఏమిటి. స్వస్థత సంఘము, ఆశీర్వాద సంఘము, సమాధాన సంఘము – ఇలా నీవెన్ని మంచి మంచి పేరులు పెట్టుకున్నా, అవన్నీ ఒకనాడు గుర్తింపు లేనివే అని గ్రహించుము.

నీవు పొందబోయే పేరుమీద ధ్యానము, ధ్యాస ఉంచుము. అట్లు మనపేరు, మన సంఘము పేరు, మన చిరునామా; ఇలా నా దేవుని పేరు మనము పొంద నర్హత దేవుడు మనకు దయచేయునుగాక . ఆమెన్

ప్రకటన 3:13 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటను ప్రకటన 2:17లో మనము ధ్యానము చేసుకుని యున్నాము.

 

ప్రకటన 3:13 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటను ప్రకటన 2:17లో మనము ధ్యానము చేసుకుని యున్నాము.

ప్రకటన 3:14 లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా

లవోదికయలో వున్న సంఘము పేరట చెప్పబడిన ఈ ప్రవచన వాక్యములు 20వ శతాబ్ద కాలమునాటి అనగా ఈ నేటి మన క్రిస్తవ సంఘములలోని స్థితిగతులను ప్రకటించుచున్నవి. ఇది యేడవ సంఘము. పరిశుద్ధ బైబిలు గ్రంధములో ఏడు సంపూర్ణతను సూచించున్నది.

అలనాడు పెంతెకోస్తు దినమున కూడి వచ్చిన విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ వ్రాలిన సంగతి (అపో 2:1-4) మనకు ఎరుకే. సంఘము హింసించబడుట, క్రైస్తవ విశ్వసులైన సువార్త వీరులైన అనేకులు శిక్షించుబడ్డారు, చంపివేయు బడ్డారు . అదే కాలములో క్రీ.శ. 81 నుండి 96 వ సంవత్సరముల కాలములో డొమీటియన్ చక్రవర్తి అపో. యోహాను గారిని పత్మసు ద్వీపమునకు పంపివేసినట్లు చరిత్ర చెబుతున్నది.

దేవుని సంఘముల విషయమై అతడెంతో విచారము కలిగి యుండగనూ, వాటి క్షేమము కొరకై ప్రార్ధించగను దేవుడతనికి బయలుపరచిన ప్రవచనము ప్రకటన గ్రంధము. క్రీ.శ.1 వ శతాబ్దము నాటికి సంఘము ఎలా పరిణతి చెందబోవుచున్నది తెలుపిన ప్రవచనమే ఎఫేసు సంఘమునకు వ్రాయించిన లేఖ. ఇలా ఒక్కొక్క సంఘమునకు వ్రాయబడిన ప్రవచనములు మనము ధ్యానిస్తూ వచ్చాము.

క్రీ.శ.2 వ శతాబ్దము నాటికి స్ముర్న సంఘము 4 నుండి 12వ శతాబ్ద కాలములో పెర్గము సంఘము, 4 వ శతాబ్ద కాలములో తుయతైర సంఘము, 14వ శాతాభ్దపు కాలమునాటికి సార్దీస్‌ సంఘ ప్రవచనము, 17వ శాతాభ్దపు కాలమునాటికి ఫిలదెల్ఫియా సంఘ ప్రవచనము, 20 వ శాతాభ్దపు కాలమునాటికి లవొదికయ సంఘ ప్రవచనము నెరవేరుచున్నవి.

నాటినుండి అనేక రీతులుగా పరిణతి చెందుతూ, ప్రభువు రాకడలో ఎత్తబడవలసిన సంఘము యే స్థితిలో ఉన్నదీ మనకు విశదమగుచున్నది. ఒకదానికొకటి అతి తక్కువ దూరములో కొలస్సేయుల సంఘము మరియు లవోదికయలో సంఘము వున్నాయి.

అపో. పౌలుగారు కొలస్సేయుల సంఘమునకు లేఖ వ్రాస్తూ; లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి (కొల 4:15, 16) లో అంటున్నారు. అప్పటిలో లవోదికయ సంఘము అర్ఖిప్పు అను దేవుని సేవకునిచేత నిర్వహించ బడుతున్నట్లు కొల 4:17 లో వ్రాయబడినది.

ఆమేన్‌ అనువాడు అనగా ఆయన మాటలో నేరవేర్పు వున్నది అని గ్రహించాలి. ఆమేన్‌ అను మాటకు అవును అని అర్ధము. ఒక సంఘము విషయమై ఆది సంభూతుడు, సర్వ సృష్టికి కారకుడు, భూమి పునాదులు వేయబడక ముందే వున్నవాడు ఆల్ఫా అయియున్నవాడు సాక్ష్యము చెబితే, ఇక దానికి మారుగా చెప్పగల వాడెవడు. కనుక ఇది నేటి మన సంఘముల ఆత్మీయ స్థితికి అడ్డం పట్టుచున్నది. బహు జాగ్రత్తగా ధ్యానము చేద్దాము. ప్రభువు ఆత్మ మనతో నుండి నడిపించును గాక. ఆమెన్

ప్రకటన 3:15, 16 నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.

ఈనాడు క్రైస్తవ సంఘము చల్లగా లేదు, వెచ్చగానూ లేదు అని ఆమెన్ అనువాడు చెప్పుచున్న ప్రవచన సాక్ష్యము. పరిశుద్ధముగాను, క్రమబద్ధముగాను జరుగవలసిన పరిచర్యలో మోమాటాలు, ప్రాధాన్యాలు, పలుకుబడులు, పదవీ వ్యామోహాలు, లోక మర్యాదలు ప్రవేశిస్తే సంఘ యొక్క క్షేమము దెబ్బతింటుంది. అందుకే ప్రభువు అంటున్నారు; వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు (ద్వితీ 5:29).

బుజ్జగించు ప్రసంగాలు, లోక ప్రయోజనాలను ఆశీర్వాదములుగా చిత్రీకరించు బోధలు, ఆత్మరగిలించు ఉజ్జీవ జ్వాలలను ఆర్పివేస్తున్న్నాయి. జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో (1 తిమో 3:15) తనకే తెలియని నేటి బోధకుడు ఇతరులకు ఏమి తర్బీదు యివ్వగలడు. ఉజ్జీవ సభలకు తిలోదకాలిచ్చి స్వస్థత సభలకు శ్రీకారం చుట్టాము. పస్కా పండుగలు ప్రక్కకు పోయి, అభిషేక పండుగలు పుంజుకున్నాయి.

అపో. పౌలు భక్తుడు సాక్ష్యమిస్తూ; తాను గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనైతిని (అపో 22:3) అంటున్నాడు. మరి నేటి దినాలలో దైవ సేవకులు అనే వారు ఎందరు ఒక బైబిలు పండితుని దగ్గర నేర్చుకుంటున్నారు? ఇంటివద్దనే కూర్చుండి, ఉత్తర ప్రత్యుత్తర చదువులు [CORRESPONDANCE COURSE]. నిష్ఠలు లేవు, శిక్షణలు లేవు, పట్టాలు, డిగ్రీలు, డాక్టరెట్లు వచ్చేశాయి.

ధ్యానించి [Meditation] బోధించుట మాని అనుకరించి [Imitation] బోధించుట అధికమైపోయింది. అందుకు కావలసిన పుస్తకాలు ఇట్టే అందుబాటులోకి వచ్చేశాయి. సిగ్గుమాలిన అబద్ద ప్రవచనాలు, మోకరించ వీలుకాని వస్త్ర ధారణలు. ప్రభువు తన మనసులోని ఉద్దేశాన్ని స్పష్టముగా చెప్పేస్తున్నారు. నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అనగా, నీ పేరైనను ఉచ్చరించలేను అంటున్నారు.

మన పితరులను; అబ్రాహామా అబ్రాహామా (ఆది 22:11), యాకోబూ యాకోబూ (ఆది 46:2), మోషే మోషే (నిర్గ 3:4). మూడవ మారు సమూయేలు (1 సమూ 3:8) అని ఆయా సందర్భాలలో పేర్లు పిలిచాడు దేవుడుయేసు క్రీస్తు వారు సైతము; మార్తా, మార్తా (లూకా 10:41), సీమోనూ, సీమోనూ (లూకా 22:31), సౌలా, సౌలా (అపో 9:4) అంటూ పేర్లు పిలిచారు. మరి ఇప్పుడు మన పేరే ఉచ్చరించ నిష్టపడని దేవుడు తన జీవ గ్రంధములో మన పేర్లు వ్రాయనిస్తాడా!!

ప్రియ స్నేహితుడా, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము (యెహో 24:15) అను యెహోషువా ప్రమాణ వాక్యములను మనసునందు వుంచుకుందాము. ఇక ఒక్కటే మార్గం, క్రైస్తవ జీవితము అనేది పూర్తిగా వ్యక్తిగతం. మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము (1 కొరిం 11:31). ఆమెన్

ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగకనేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.

ఐదు అవలక్షణాలు నేటి సంఘములో వున్నట్లు దేవుడే నిర్ధారించు చున్నారు. 1. దౌర్భాగ్యం 2. దిక్కులేని తనం 3. దారిద్ర్యం 4. గ్రుడ్డితనము 5. దిగంబరత్వం. కొదువ లేనంత సొమ్ము కూడబెట్టాను, నాకేమి తక్కువ అనే ధోరణిలో సాగుతున్నది ఆధునిక సంఘము. దౌర్భాగ్య స్థితి అనగా ఆత్మలో దీనత్వం పూర్తిగా కోల్పోయినామని అర్ధము. యేసు కొండమీద ప్రసంగిస్తూ; ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది (మత్త 5:3) అన్నారు.

ఆత్మీయ దీనత్వము లేని ఒక వ్యక్తిని ప్రభువు ఉపమాన రీతిగా చూపుతూ; వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను (లూకా 18:12) అని చెప్పారు. అవును, అతడు ఉపవాస ప్రార్ధన చేస్తే దేవుడు నా మనవి ఆలకిస్తాడు అనుకున్నాడు. దశమ భాగము రూపములో సంఘానికి డబ్బు బాగానే ఇస్తున్నాను అనుకుంటూ న్నాడు. ప్రియులారా, మనమేమైయున్నామో అది దేవుని కృపవలననే అయియున్నాము (1 కొరిం 15:10) అని మరువ వద్దు.

లవొదికయలో ఉన్న సంఘపు దూతను కాదా, నీవు గ్రుడ్డివాడవు అంటున్నారు ప్రభువు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు (యెష 42:19, 20).

విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్ర హము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ ఎవనికి లేకపోవునో వాడు గ్రుడ్డివాడగును.( 2 పేతు 1:5-9) అని వాక్యము సెలవిస్తున్నది ప్రియ దేవుని సంఘమా. నీవు దిగంబరివి అంటున్నారు ప్రభువు. ఇది సిగ్గు ఎరుగని చిన్నతనమా లేక వయసు వచ్చాక సిగ్గు విడిచిన వైనమా, ఏమనాలి? సంఘమున్నది, సంఘస్తులున్నారు, బోధవున్నది బోధకులున్నారు, మందిరమున్నది మందిర కార్యక్రమాలున్నవి కాని యే ఒక్కరికీ రక్షణ వస్త్రమే లేదు అంటుంది ప్రవచన సత్యం.

దేవుడైన యెహోవా మోషేతో; దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నారు (నిర్గ 3:5) కాని, నేడు పరిశుద్ధ ప్రదేశములోనే బూట్లు సూట్లు కోట్లు ఫోకస్ లైట్లు. ఏమి లాభం, దేవునికి అందరూ దిగంబరులు గానే కనబడుతున్నారట. క్రీస్తు శరీరము అను సంఘము ఇప్పటికీ నిలువుటంగీ తీసివేయబడి, సిలువమీద వ్రేలాడుతున్న క్రీస్తునే ఆరాధించుచున్నదా!! సమాధి కొరకు సిద్ధపరచినప్పుడు కనీసం ప్రేత వస్త్రము చుట్టబడతది కాదా.

ఆత్మీయ దిగజారుడు తనమును గ్రహించుకోలేని దౌర్భాగ్య విశ్వాసి రక్షణ లేని దిగంబర విశ్వాసి నాకేమి కొదువలేదు కావలసినంత ధనము వున్నది అని తృప్తి పడుచున్నాడు. ధనము దేవుని దానమే కాని ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును (1 తిమో 6:9).

ఐతే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింప కూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింప కూడదు. అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు యిర్మీ 9:23, 24).

కోట్ల విలువైన మందిరాలు కట్టి, లక్షల ఖరీదైన కార్లలో తిరిగి, నిలువెత్తు ఫ్లెక్సీలతో మహాసభలు జరిపి, యీలోకములో ఘన సన్మానాలు చేపించుకుని; ఒక్క పేద సంఘానికైనా సహాయపడక, ఒక్క నిరుపేద విశ్వాసి కుటుంబాన్నైనా ఆదుకొనక పరిచర్య చేసిచేసి; రేపు ప్రభువు దగ్గరకు వెళితే, ఎంత ఆస్థి సంపాదించావు అని అడిగితే ఫర్వాలేదు. కాని, ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడిగితే, ఏమి జవాబు యిస్తావు ఆధునిక సంఘమా?

ప్రతి అవసరానికి ఎవరో ఒకరిని ఆశ్రయించుట, సహాయముకొరకు పరుగెత్తుట మాని మొదట ప్రభువును అడుగుదాము. ఉజ్జీవములేని నిర్జీవ క్రియలతో చేసే సేవను దేవుడు ద్వేషిస్తున్నాడు అని గ్రహించు కుందాము. ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? (యాకో 2:5).

యెహోషాపాతు రాజు యుద్ధభూమిలో నిస్సహాయ స్థితిలో చేసిన ప్రార్ధన జ్ఞప్తికి తెచ్చుకుందాము. ప్రియులారా; మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేద్దాం (2 దిన 20:12). దేవుడే మనలను మన సంఘములను ప్రక్షాళన చేయునుగాక. ఆమెన్

ప్రకటన 3:18 నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

నీకు బుద్ధి చెప్పుచున్నాను అను మాట ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నది. శిక్షకు తగిన తప్పిదములు ఉన్నప్పటికీ అపారమైన తన ప్రేమను చూపక మానని దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతా స్తుతులు చెల్లునుగాక, ఆమెన్. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మనలను జీవింపచేసెను (కొల 2:14, 15).

అగ్నిలో పుటమువేయబడిన బంగారము అనగా నీ మనస్సాక్షిని స్వస్థపరచుకొనుము అంటున్నారు ప్రభువు. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును (1 పేతు 1:7).

దిసమొల సిగ్గు కనబడకుండునట్లు లేక సంఘముయొక్క అవమానము గిల్గాలులో తీసివేసిన దేవుడు; అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను (యెహో 5:9). తెల్లని వస్త్రములను అనగా క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్య ప్రకారము (1 కొరిం 15:54) మనలను సిద్ధపరచిన దేవుడే; ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించ గోరుచున్నాడు (2 కొరిం 5:5).

నీకు దృష్టికలుగునట్లు నీవు [సిలోయము కోనేటికి వెళ్లి అందులో] కడుగు కొనుమని చెప్పెను. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను (యోహా 9:7). ఇట్లు మన మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మనలను పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మనము తెలిసికొనునట్లు ప్రార్ధన చేద్దాం (ఎఫే 1:17-19).

ప్రియ స్నేహితుడా, ఇందునిమిత్తమే కదా క్రీస్తు మనకొరకు యాగమై ప్రాణ త్యాగమై తన రక్తమిచ్చి కొనబడిన సంఘములో అంగములుగా చేసియున్నాడు. శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది (యెష 61:10).

బుద్ధి తెచ్చుకొని మళ్లుకొనిన యెడల; ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి (లూకా 15:23) అని తన దాసులకు సెలవియ్యడా! మనము తిని సంతోషపడునట్లు తన బల్ల దగ్గరకు చేర్చుకోడా! (లూకా 15:22, 23). నాయొద్దనే కొనుము అంటున్న దేవుడే తన వాగ్దానమును మనకొరకు ముందుగానే సిద్ధపరచి పిలిచి యున్నాడు.

దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును (యెష 55:1-3).

దేవదేవుని దీవెన ఆశీర్వాదము మనపై నిండుగా నిత్యమూ నిలిచి యుండునుగాక. ఆమెన్

ప్రకటన 3:19 నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.

నేను ప్రేమించుచున్నాను అంటున్నారు ప్రభువు. ఇంతకు ముందే చెప్పారు: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను (యిర్మీ 31:3) అని. అది సాటిలేని ప్రేమ, నిస్వార్ధ ప్రేమ, త్యాగ సహిత ప్రేమ, నిరుపమాన్ ప్రేమ, ఇలా చెపుతూ పోతే ఒక జీవితము చాలదు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును (సామె 3:12).

అపో. పౌలు గారు ప్రభువును ఎంతగా ప్రేమించాడో తెలుపుతూ కొరింథీ సంఘమునకు ఒక మాట వ్రాస్తున్నాడు : ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక (1 కొరిం 16:22). నేను ప్రభువును అధికముగా ప్రేమిస్తున్నాను అని చెప్పే ఆత్మ స్థైర్యము అతనిలో మనకు కనబడుచున్నది, అందుకే ఎవడైనా ప్రభువును ప్రేమించడు అంటే సహించలేను అని అతని భావన.

బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును (సామె 13:24). ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను (ద్వితీ 8:5,6). నేనతనికి తండ్రినై యుందును అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును (2 సమూ 7:14) అంటున్నారు ప్రభువు.

అప్పుడప్పుడు చిన్నచిన్న దెబ్బలు, చిన్నచిన్న శిక్షలు పడుతున్నప్పుడు ఎప్పుడైనా దేవుని ప్రేమను పొందుతున్నట్లు అనుభూతి కలిగిందా, నేస్తం. దావీదు కీర్తన 23:4 లో నీ దుడ్డుకఱ్ఱయు నన్ను ఆదరించును వ్రాస్తున్నాడు. కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు (హెబ్రీ 12:8) అంటున్నారు పౌలు భక్తుడు.

దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము (యోబు 5:17). నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు (సామె 3:11). శిక్షను అంగీకరించిన విశ్వాసి ప్రార్ధన: యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము (యిర్మీ 10:24), ఆమెన్.

సత్యము నుండి సర్వ సత్యములోనికి నడిపించు ఆత్మ కార్యము నీలో జరుగనిమ్ము ప్రియుడా. దేవుడు ప్రేమతో శిక్షించినా, కోపముతో శిక్షించినా చివరికి ఆయన కోరుచున్నది ఒక్కటే: నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మారు మనస్సు పొందుట అంటే కేవలము అలవాట్లు మార్చుకొనుట కాదు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు (జక 1:3).

మారు మనస్సు పొందుము అనుమాటను ప్రక 2:5 లోని ధ్యానమును మనము జ్ఞాపకము చేసుకుందాము. ప్రభువుని ఆత్మ మీతో నుండునుగాక. ఆమెన్

ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

సహోదర ప్రేమ అని అర్ధమిచ్చు లవొదికయ పట్టణం లో వున్న ఈ సంఘమును గూర్త్చి దేవుడు పలికిన మాట బహు దుఃఖము కలిగించు చున్నది. ఆది సంఘ కాలములో నేను యేడు దీపస్తంభములమధ్య సంచరించుచున్నాను (ప్రక 2:1) అని పలికిన దేవుడు ఇప్పుడు ఆధునిక సంఘముతో; వెలుపల నిలిచి యున్నాననియూ, తాను ప్రవేశింప లేకుండునట్లు సంఘంపు తలుపులు మూయబడి యున్నవనియూ సెలవిచ్చుచున్నారు.

ఎంత సేపటినుండి వేచియున్నారో తెలుపలేదు. సంఘ పక్షముగా ధ్యానించిన ఈ మాటను వ్యక్తిగతముగా ఆలోచించినప్పుడు ఏమి తోచుచున్నది? దేవుడు మన హృదయమను ఆలయము లోపల వున్నాడా లేక వెలుపల వున్నాడా? తలుపు తట్టుచునే పిలుచుచునే వున్నారు. ఎవడైనను నా స్వరము విని అను మాట నా స్వరము వినువాడు ఎవడూ లేడా అన్నట్లు వున్నది. నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు (ప. గీ. 5:2).

ఎందుకు క్రీస్తు తన సంఘము వెలుపల వున్నాడు అంటే, సంఘమా 1. నీవు నులివెచ్చగా వున్నావు 2. ఆర్ధిక సమృద్ధినే ఆత్మీయ ఆశీర్వాదము అనుకుంటున్నావు 3. ఆయన ప్రేమను గద్దింపును పెడచెవిని పెట్టుచున్నావు 4. రక్షణ వస్త్రములు లేని నీ దిగంబరత్వమును గుర్తించలేకున్నావు 5. ఒకనిమీదనొకడు సణుగుట కనబడు చున్నది (యాకో 5:9) 6. ఆయన స్వరము గుర్తుపట్టలేక పోవుచున్నావు (యోహా 20:15).

తానే ద్వారమైయున్నదేవుడు; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును (యోహా 10:9) అంటున్నారు. అనగా ఆ ప్రేమామయుని ద్వారము మనకొరకు నిత్యమూ తెరువబడి యున్నది. మరొక వాగ్దానము కూడా మనకు వున్నది: తట్టుడి మీకు తీయబడును (మత్త 7:7). అందునుబట్టియే కదా, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవే శించుటకు మనకు ధైర్యము కలిగియున్నది (హెబ్రీ 10:20).

ప్రియ స్నేహితుడా, ఇప్పుడే నీ హృదయపు ద్వారము తెరువుము. లేని యెడల: నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు (ప. గీ. 5:6). కనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి (హెబ్రీ 3:14). విడిచిపెట్టని దేవుడు ఇంకా పిలుస్తూనే వున్నాడు, పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము (ప్రక 19:9) అంటున్నారు.

నేను వస్తాను భోజన సహవాసము చేస్తాను అంటున్నారు ప్రభువు. యేసు లేని ప్రభువు భోజనపు బల్ల ఆచరిస్తున్న సంఘమా, యేసుతో యేసులో లేకయే క్రీస్తు శరీర రక్తములలో పాలుపుచ్చు కొనుచున్న ప్రియ సోదరీ, సోదరుడా; అది ప్రమాదకరము అని గ్రహించు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు (1 కొరిం 11:30). మొదటి నిబంధన రక్త ప్రోక్షణలో ఇశ్రాయేలీయులు అనుసరించిన సంగతి చూస్తే; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి (నిర్గ 24:11) అని వ్రాయబడి యున్నది.

ప్రియ నేస్తం, మారు మనస్సు పొందిన జక్కయ్య ఇంటికి యేసయ్య బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి (లూకా 19:7). బేతనియలో యేసయ్య తాను ప్రేమించిన వారి ఇంట వున్నప్పుడు లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు (యోహా 12:2). యేసు ప్రభువు అప్పగింప బడిన రాత్రి వారు భోజనము చేయుచుండగా తన శరీర రక్తములకు సాదృశ్యముగా రొట్టె ద్రాక్షా రసము ఇచ్చినట్టు వ్రాయబడియున్నది. అదే సమయములో నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదును అంటూ సెలవిచ్చారు (మత్త 26:26-28).

ఇప్పుడు మనము ప్రభువును మనతో భోజనమునకు అంగీకరిస్తే త్వరలో ఆయన మనలను తనతో భోజనమునకు పిలుస్తాడట : ప్రక 19:9 ప్రకారం గొఱ్ఱపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులు అని మనకు ఆహ్వానం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెనట (2 సమూ 9:13). అట్టి ధన్యత నాకును నాతో కలిసి దివారాత్రులు వాక్యము ధ్యానిస్తున్న వారందరికినీ కలుగును గాక. ఆమెన్

ప్రకటన 3:21, 22 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

పై వచనములో చూసినప్పుడు క్రీస్తు సంఘము వెలుపల లేక హృదయ ద్వారమునొద్ద నిలిచి యున్నట్లు ధ్యానించుచూ వచ్చాము. ఆ పరిస్థితిలో కూడా ప్రభువు ఏ సంఘముతోనూ చేయని గొప్ప వాగ్దానము చేస్తున్నారు. మారని ప్రేమామయుడు నిత్యము స్తోత్రార్హుడు. క్రీస్తు తన తండ్రితో సింహాసనము మీద కూర్చుండి యున్నారు. ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తండ్రి తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు (ఎఫే 1:20, 21).

జయించిన వానికి అనగా ఆయన స్వరము విని ఆయనకు తలుపు తీసినవానికి నేరవేర్చబోవు వాగ్దానమును ప్రభువు ముందుగానే శిష్యులకు బయలుపరిచారు. నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొందురు (లూకా 22:29). ఈ విషయమై యేసుక్రీస్తు వారు తండ్రిని ఈలాగు ప్రార్ధించుట మరి ఎక్కువగా మనకు ఆశర్యము కలుగుచున్నది: తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను (యోహా 17:24).

క్రైస్తవ జీవితము కేవలము ఆనంద సంతోషాలతో జీవించి భూసంబంధ మైన దీవెనలు ఆశీర్వాదములు అనుభవించుట కాదు, నిత్యమైన పరలోక మహిమలో ప్రభువుతో నుండుట అని మనసున వుంచుకొని మనము జీవించాలి. సింహాసనము మీద కూర్చుండుట అధికారము ఇయ్యబడుటను సూచించుచున్నది. ఆ చొప్పున జరుగునని ప్రభువైన యేసు క్రీస్తు: మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్త 19:28) అని ప్రకటించారు.

ఈలోకపు ఆశ గతించి పోవుచున్నది. లోకములో వున్నదంతయూ నేత్రాశ శరీరాశ జీవపు దంబమేగా, ఇంకేమున్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డా, ప్రభువు ఆశించిన జీవితము జీవించ తీర్మానము చేసుకుందామా. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించును గాక. ఆమెన్ జయించువారు అను అంశాన్ని ప్రకటన 2:7లో ధ్యానిస్తూ వచ్చాము.

7 సంఘముల విషయమైన ప్రవచనముల పునశ్చరణ:

ప్రకటన గ్రంధము మొదటి 3 అధ్యాయములలో సంఘములకు దేవుని ప్రత్యక్షతలు లేక దర్శనములు వర్తమానములు మెప్పులు విమర్శలు సలహాలు వాగ్దానములు ఇంతవరకు చూస్తూ వచ్చాము. 1 వ అధ్యాయము నుండి ౩వ అధ్యాయము వరకు గల 71 వచనములలో సంఘము అనిగాని సంఘపు అనిగాని వెరశి 18 సార్లు సంఘము గూర్చి ప్రస్థావించ బడినది. తిరిగి 19 వ సారి అనగా చివరి సారిగా ప్రక 22:16 లో కనబడుచున్నది. అది కేవలము ముగింపు మాత్రమే.

4 వ అధ్యాయము నుండి చివరి వరకూ గమనించినట్లైతే గోర్రేపెల్ల వివాహము కొరకు సిద్ధపాటు కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిలు గ్రంధము ముఖ్యముగా మానవులను రక్షింపబడిన వారు రక్షణ లేని వారు అను రెండు భాగాలుగా విభజించు చున్నది. దేవుడు ఒక వర్గము మీద ప్రేమ వాత్సల్యత చూపుతూ మరొక వర్గము వారిని ఇప్పుడైనా మారుమనస్సు పొందండి అంటూ హెఛరిస్థున్నట్టు మనకు స్పష్టమవుతున్నది.

4 వ అధ్యాయము మొదలు మిగతా అధ్యాయములలో సంఘములో వున్నవారు సంఘము వెలుపల వున్నవారు అనే భావన నుండి విడిపించి పరలోకములో సంభవములు భూలోకములో సంభవములు అను భావన స్ఫురించు ప్రవచనములు వ్రాయబడినట్టు గమనించ గలము. ముందుగా, సంఘమునకు క్రీస్తు ఇచ్చిన ప్రతి వాగ్దానము ఎలా నెరవేర బోవుచున్నది ఒక్క సారి గమనించుకొని ముందుకు సాగుదాము.

ఎఫేసు సంఘ వాగ్దానము: దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును (ప్రక 2:7), నేరవేర్పు: జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు (ప్రక 22:14).

స్ముర్న సంఘ వాగ్దానము: రెండవ మరణము వలన ఏ హానియుచెందడు (ప్రక 2:11). నెరవేర్పు: మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము (ప్రక 20:14).

పెర్గము సంఘ వాద్గానము: తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు (ప్రక 2:17). నెరవేర్పు: మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి (ప్రక 14:1).

తుయతైర సంఘ వాగ్దానము: జనులమీద అధికారము ఇచ్చెదను, వేకువ చుక్కను ఇచ్చెదను (ప్రక 2:26, 28). నెరవేర్పు: అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను (ప్రక 20:4). సంఘములకోసము నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను (ప్రక 22:16).

సార్దీస్ సంఘ వాగ్దానము: తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును (ప్రక 3:5). నెరవేర్పు: వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపల్లఎదుటను నిలువబడిరి (ప్రక 7:9). వీరు గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి (ప్రక 7:14).

ఫిలదెల్ఫియ సంఘ వాద్గానము: నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను (ప్రక 3:12). నెరవేర్పు: ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి (ప్రక 14:1). ఆయన నామము వారి నొసళ్లయందుండును (ప్రక 22:4).

లవోదికయ సంఘ వాద్గానము: నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను (ప్రక 3:21). నెరవేర్పు: అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను (ప్రక 20:4).

క్రీస్తు ఆత్మ మనతో నుండునుగాక. ఆమెన్


Share this post