Skip to Content

మలాకీ

  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వాగ్దానములు గలవనియు మేము మిక్కిలి క్షేమముగా నున్నామనియు గర్వపడుచుండిరి. వారు మిక్కిలి హేయమైన ప్రవర్తన గల దుష్టతరము వారైయుండిరి. అట్టివారికి మలాకీ దేవుని సందేశములను అందించుచున్నాడు. మలాకీ ప్రశ్నలు వేయుట, జవాబులు చెప్పుట అను పద్ధతి అనుసరించెను. వారి వేషధారణను, మిశ్రమ వివాహ పద్ధతిని, విడాకుల ద్వారా వివాహములను రద్దుచేసికొను విధానమును, భక్తి లేని కేవలము ఆచారములతో కూడిన ఆరాధనను, అసూయతో నిండిన వినాశకరమైన జీవన విధానమును నిశితముగా పరిశీలించిన మలాకీ తీవ్రపద జాలముతో యూదులను గద్దించెను. అటు తరువాత దేవుడు 400 సంవత్సరము పర్యంతము మౌనముగా నుండెను. అనగా ఆ 400 సంవత్సరములలో ఒక్క ప్రవక్త కూడ ప్రవచించలేదు. తరువాత (మలాకీ 3:1)లో చెప్పబడిన ప్రకారము బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు తన ప్రవచన స్వరమును వినిపింపజేసెను. మలాకీ అనగా నా దూత అని అర్థము. బహుశ ఇది యెహోవా దూత అను అర్థమిచ్చు మలాకాయహా అను నామమునకు సంక్షిప్త రూపమై యుండవచ్చును. క్రొత్త నిబంధన దూతయైన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చి తెలియజేయుచున్న ఈ గ్రంథమునకు ఈ పేరు తగియున్నది. మలాకీ 2:7మలాకీ 3:1 మున్నగు వచనములలో వివాదములు లేవు. గ్రంథమంతా ఒకరి చేతనే వ్రాయబడియున్నది అను విషయములో భిన్నాభిప్రాయములు లేవు. సంభాషణా ధోరణి గ్రంథమంతటా వ్యాప్తి చెంది యున్నది. ఈయనను గూర్చి తెలిసికొనుట ఇతర ఆధారములు ఏవియు లేవు. ఈయన తండ్రి పేరు అయినను మనకు లభించుట లేదు. అయినను ఈయన ఒక సమాజమందిర సభ్యుడు అని యుదా పారంపర్యము నమ్ముచున్నది.

మలాకీ కాలము : మలాకీ గ్రంథ కాలమును నిర్ణయించుటకు తగిన ఆధారములు లేనప్పటికిని, ఈ గ్రంథములోనే ఇవ్వబడిన కొంత సమాచారమును బట్టి ఈయన కాలమును గుర్తించుచున్నాము. మలాకీ 1:8 లో వ్రాయబడిన అధికారి అను పదము హగ్గయి 1:1హగ్గయి 1:14హగ్గయి 2:21 లలో కనిపించుటను బట్టి ఇశ్రాయేలీయులు పారశీకపాలకులకు లోబడియున్న కాలములో క్రీ.పూ 539 - 333 ఈ గ్రంథము వ్రాయబడి యుండునని తలంచవచ్చును. క్రీ.పూ 516లో పునర్నిర్మింపబడిన యెరూషలేము దేవాలయములో ఆ గ్రంథ రచనా కాలములో బలులు అర్పింపబడుచున్నవి (మలాకీ 1:7-15మలాకీ 3:8) ఈ విధముగా బలులు అలవాటు మరల ప్రారంభింపబడిన తరువాత కొన్ని సంవత్సరములకు ఈ గ్రంథ రచన జరిగియుండును. బలియర్పణ పురాతన ఆచారము. చాలనియమములు పాటించవలసి యుండగా మలాకీ కాలములో నియమ పాలన జరుగలేదు. లోపము గల వాటిని బలి అర్పించుట హేయముగా నుండెను. మరియు నెహెమ్యా కనుగొనిన లోపమునే మలాకీ కూడ చూచెను. వారు కనుగొన్న సమస్యలు ఈ క్రింద విధముగా నున్నవి.

  1. నీచులైన యాజకులు (మలాకీ 1:6మలాకీ 2:9నెహెమ్యా 13:1-9). 2. దశము భాగములను, కానుకలను నిర్లక్ష్యము చేయుట (మలాకీ 3:7-12నెహెమ్యా 13:10-13).   3. అన్యజనులతో వివాహ బంధము మలాకీ 2:10-16నెహెమ్యా 13:23-28.

     నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకరములను కట్టుటకు క్రీ.పూ. 444లో యెరూషలేముకు వచ్చెను. ఎజ్రా దేవాలయ నిర్మాణమును ప్రారంభించి అప్పటికి 13 సంవత్సరములు గతించినవి. క్రీ.పూ 432లో నెహెమ్యా మరల పారశీక దేశమునకు వెళ్లెను. తరువాత క్రీ.పూ 425లో అతను మరల యెరూషలేమునకు వచ్చెను. అప్పడతడు ఇశ్రాయేలీయులలోనున్న వివిధ పాపపు అలవాటులను మార్చి వేసెను. కావున నెహెమ్యా యెరూషలేములో లేని కాలములో అనగా క్రీ. పూ. 432, 425ల మధ్య కాలములో మలాకీ ప్రవచించెనని అభిప్రాయపడుట మిక్కిలి తగినదైయున్నది. గ్రంథము హగ్గయి, జెకర్యా ప్రవక్తల కాలమునకు (క్రీ.పూ. 420) నూరు సంవత్సరముల తరువాత వ్రాయబడి యుండవచ్చు.

ముఖ్య పద సముదాయము : వెనుకంజ వేసిన వారికి ఆహ్వానము.

ముఖ్య వచనములు: మలాకీ 2:17మలాకీ 3:1మలాకీ 4:5-6

ముఖ్య అధ్యాయము : 3

     పాతనిబంధనలోని ఈ చివరి గ్రంథము యేసు క్రీస్తును గూర్చియు, ఆయనకు ముందుగా పంపబడిన బాప్తీస్మమిచ్చు యోహానును గూర్చియు ప్రవచించుటతో ముగింపబడుచున్నది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మలాకీ 3:1 నాలుగు వందల సంవత్సరముల దీర్ఘకాల ప్రవచన లేమిని తొలగించి ఇదిగో అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అను పలుకులతో యెహాను బయలుపరచబడెను. అప్పుడు యోర్దాను నదీ తీరమున ఉన్న యోహాను వద్దకు ఇశ్రాయేలు ప్రజలు కూడి వచ్చిరి. మలాకీ 3 , 4 అధ్యాయములు మెస్సీయా రాకడను, ఆయనకు ముందుగా రానున్న దూత రాకడను గూర్చియు ప్రవచించుట ద్వారా పాత నిబంధనకును, క్రొత్తని బంధనకును నడమ ఒక వంతెనగా నిలువబడుచున్నవి.

గ్రంథవిభజన : ప్రశ్నలు – జవాబులతో కూడియుండి సంభాషణా రూపమును మలాకీ దేవుని సందేశమును ప్రజల ముందు క్లుప్తముగా బోధించెను. ఈ సందేశముతో పాతనిబంధన ముగియుచున్నది. మలాకీ ఇశ్రాయేలీయులకు సంబంధించిన మూడు ముఖ్య విషయములను ప్రవచించుచున్నాడు.

1.యూదా ప్రజల ఆత్మీయ స్థితి మలాకీ 1:1-5  2.యూదుల అప విత్రత Mal,1,6-3,15  3.యూదుల కొరకు వాగ్దానములు. Mal,3,16-4,6

(a). జ్ఞాపకార్ధ గ్రంథములో వ్రాయబడియున్నవారి ఫలితములు మలాకీ 3:16-18   (b). క్రీస్తు రాకడవలన సంభవించు ఫలితములు మలాకీ 4:1-3  (c). ఏలీయా రాకడను గూర్చిన ప్రవచనములు మలాకీ 4:4-6

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 39వ పుస్తకము; చివరి పుస్తకము . అధ్యాయములు 4; వచనములు 55; ప్రశ్నలు 27; ఇశ్రాయేలీయులు పాపములు తెలుపు వాక్యములు 32; ఆజ్ఞలు 5; వాగ్దానములు 5; హెచ్చరికలు 30; ప్రవచన వాక్యములు 19; నెరవేరిన ప్రవచనములు 6; నెరవేరనున్న ప్రవచనములు 13; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 28.


Share this post