- Author: Sajeeva Vahini
- Category: Bible Study
- Reference: Sajeeva Vahini
పౌలు కొరింథుకు వ్రాసిన మొదటి పత్రికకు తరువాత అబద్ధ బోధకులు అక్కడకు పోయి పౌలుకు వ్యతిరేకముగా ప్రజలను పురికొల్పిలేపిరి. పౌలు అస్థిరుడును, అధిక స్వార్థప్రియుడును, హెచ్చింపుకు, పొగడ్తకు, గౌరవమునకు తగిన వాడును, వేషదారియు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా పేర్కొన అనర్హుడును అని అతనిపై నేరము మోపిరి. ఇట్టి స్థితిని సంధించుటకు తీతును పౌలు కొరింథునకు పంపెను. తీతు తిరిగి వచ్చినప్పుడు కొరింథీయులకు ఏర్పడిన మారు మనస్సును పౌలు విని సంతోషించెను. మారుమనస్సు పొందిన అనేకులకు కృతజ్ఞత చెప్పుటకును మారు మనస్సులేని కొంతమందితో వాదించుటకును ఈ రెండవ పత్రికను వ్రాసెను. పత్రికారంభము మొదలుకొని చివరి వరకు అతను తన గుణమును, ప్రవర్తనను, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడను స్థితిలో నున్న అతని యొక్క పిలుపును గూర్చి వారితో వాదించుచున్నాడు.
ఉద్దేశము:- తన అపొస్తలుల అధికారమును, సేవను, దృఢపరచుట, కొరింథీయ అబద్ధ బోధకులను కనపరచుట.
వ్రాసినవారు:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- కొరింధి సంఘమునకు, అంతటనుగల క్రైస్తవ విశ్వాసులకు.
వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ. 56లో మాసిదోనియాలో నుండి.
ముఖ్య వ్యక్తులు:- పౌలు, తిమోతి, తీతు, అబద్ధ బోధకులు.
ముఖ్య స్థలములు:- కొరింధు, యెరూషలేము.
గ్రంధ శ్రేష్ఠత:- వ్యక్తిగతమైనదియును, స్వీయచరిత్ర స్థితిలో నున్న ఒక పత్రిక.
ముఖ్య వార్త:- పౌలు యొక్క సేవనుగూర్చిన వివాదము.
ముఖ్య వచనములు:- 2 కోరింథీయులకు 4:5-6; 2 కోరింథీయులకు 5:17-19.
ముఖ్య అధ్యాయము:- 8, 9 అధ్యాయములు ఒకే భాగముగా నిలిచి ఇతర గ్రంథ భాగములలో ఎక్కడను కనిపించని రీతిని పూర్ణమైన స్థితిలో క్రైస్తవ సహాయ స్వభావమును బయలుపరచుచున్న విస్సహాయము యొక్క మూలాధారమైన ప్రమాణము (2 కోరింథీయులకు 8:1-6) ఆసక్తి (2Chor,8,16-9,5) ప్రతిఫలము వాగ్దానము (2 కోరింథీయులకు 9:5-15) మొదలగునవి ఈ అధ్యాయములు వివరించుచున్నవి.
క్రీస్తు 2 కొరింథీ : - పత్రికలో క్రీస్తు విశ్వాసుల యొక్క ఆదరణ (2 కోరింథీయులకు 1:5) విజయమునిచ్చుట (2 కోరింథీయులకు 2:14), ప్రభువు (2 కోరింథీయులకు 4:5), వెలుగు (2 కోరింథీయులకు 4:6), న్యాయాధిపతి (2 కోరింథీయులకు 5:10), సమాధానములు (2 కోరింథీయులకు 5:19), పరిహారకుడు (2 కోరింథీయులకు 5:21), ఈవి (2 కోరింథీయులకు 9:15), స్వంతదారుడు (2 కోరింథీయులకు 10:7), శక్తి (2 కోరింథీయులకు 12:9) మొదలగు స్థితులలో చెప్పబడుచున్నాడు.
గ్రంధ విభజన:- ఒక అపొస్తలుని యొక్క రుజువును నిరూపించు పత్రికయని 2 కొరింథీని చెప్పవచ్చును. కొరింధీ ప్రజలను పౌలుకు విరోధముగా రేపిన అబద్ధ బోధకులను హెచ్చరించుటలో గొప్ప ప్రఖ్యాతి గడించి యుండిరి. అట్టి పరిస్థితిలో అపొస్తలులు అను భావనతో అతని గుణము, ప్రవర్తన, దేవుని పిలుపు మొదలగు వాటి నిజత్వమును విశధపరుచ పౌలు ఈ పత్రికను ఉపయోగించుచున్నాడు. పత్రిక యొక్క మూడు ముఖ్య విభజనలు క్రింద చూడుడి.
(1) తన సేవలను గూర్చిన పౌలు యొక్క వివరణ అధ్యాయము 1-7 వరకు
(2) పరిశుద్ధుల కొరకు పౌలు చేసిన సహాయనిధి పని. అధ్యాయము 8-9 వరకు
(3) తన అపొస్తలత్వమును పౌలు నిలుపుకొనుట. అధ్యా 10-13
కొన్నిగుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథములో 47వ పుస్తకము; అధ్యాయములు 13; వచనములు 257; ప్రశ్నలు 29; పాత నిబంధన ప్రవచనములు 4; క్రొత్త నిబంధన ప్రవచనములు 4; చారిత్రక వచనములు 249; నెరవేరిన ప్రవచనములు 4; నెరవేరని ప్రవచనములు 4.