Skip to Content

జెకర్యా | Zechariah

  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

బబులోను చెర తరువాత కాలమునకు చెందిన ప్రవక్త జెకర్యా. ఈయన బబులోనులో పుట్టిన లేవీయుడు, (నెహెమ్యా 12:16) చెరసాల చరిత్రను తరచిచూచిన యెడల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీ.పూ. 722లో అషూరు సైన్యమునకు లొంగిపోయి దీనావస్థలో పడెను. దక్షిణ దేశమైన యూదాకు ఇట్టి దుస్థితి క్రీ.పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దండయాత్ర ఫలితముగా తటస్థించెను. యూదులలో అనేకులు సుమారు 70 సంవత్సరములు బబులోను దాస్యములో నుండిరి. క్రీ.పూ. 539లో పారశీక మహా సామ్రాజ్యము బబులోను మహాసామ్రాజ్యమును జయించెను. పారశీక సామ్రాజ్యపు నూతన విదేశీ విధానము మూలమున యూదులు స్వదేశమునకు మరల వలెననియు, నెబుకద్నెజరు దండెత్తి కొల్లగొట్టి నాశనము గావించిన వారి దేవాలయమును పునర్నిర్మాణముగావించవలెననియు కోరేషు ఆజ్ఞ వెలువడెను. ఈ ఆజ్ఞననుసరించి జెరుబ్బాబెలు (ఇతడు తరువాత గవర్నరుగా నియమింపబడెను) యొక్కయు యాజకుడైన యెహోషువ యొక్క నాయకత్వమున సుమారు 50,000 మంది యూదాకు తిరిగివచ్చిరి. ఇట్లు వచ్చిన వారిలో ప్రవక్తయైన జెకర్యా ఒకడు. యెరూషలేమునకు రాగానే వారు పూర్వ ప్రకారంగా ఒక బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించారు. (ఎజ్రా 3:1-6) వారు తమ స్వదేశమునకు వచ్చిన తరువాత రెండవ సంవత్సరములోనే దేవాలయమును కట్టుటకు పునాది వేసిరి. (ఎజ్రా 3:8-13ఎజ్రా 5:16) కాని వెలుపటి ఆటంకముల మూలమునను, లోపటి సమస్యల మూలమునను దేవాలయ నిర్మాణము 16 సంవత్సరముల ఆటంకపరచబడినది. అటు తరువాత పారశీకరాజైన దర్యావేషు కాలమున (క్రీ.పూ. 522 - 486) మరల దేవాలయ నిర్మాణము ప్రారంభింపబడియున్నది. దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరమున (క్రీ.పూ. 520లో) యెహోవా హగ్గయిను దేవాళయ నిర్మాణపు పనికి ప్రోత్సాహమిచ్చుటకు లేపెను. హగ్గయి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వర్తమానములను అందించి తన పరిచర్యను పూర్తిచేసికొనెను. హగ్గయి తరువాత జెకర్యా అదే పరిచర్యను చేపట్టెను. (హగ్గయి 1:1జెకర్యా 1:1) జెకర్యా ఖండించి బుద్ధి చెప్పు ఉపదేశ మార్గమును పాటించలేదు. తమ ఉజ్జ్వల భవిష్యత్తు కొరకును దేశాభివృద్ధి కొరకును దేవాలయ నిర్మాణము చేపట్టుట ఎంత ప్రాముఖ్యమో ప్రజలకు వివరించెను. ప్రజలు గొప్ప స్ఫూర్తితో దేవాలయ నిర్మాణములో ముమ్మరముగా పాల్గొనిరి. క్రీ.పూ. 516లో దేవాలయ నిర్మాణ పని పూర్తియైనది నిర్మాణమునకు సహాయపడిన దర్యావేషు తరువాత అహష్వేరోషు. (క్రీ.పూ 486 - 464) ఈ అహష్వేరోషే వస్తిని రాణి పదవి నుండి తొలగించి ఎస్తేరును పారశీక దేశపు రాణిగా చేసికొనెను. జెకర్యా అను నామమునకు “యెహోవా జ్ఞాపకము చేసికొనును” అని అర్థము. ఇదే భావము గల సందేశము ఈ గ్రంథములో అధికముగా వ్యాపించియున్నది. ఇశ్రాయేలీయుల మూల పితరులతో తాను చేసిన నిబంధనలను యెహోవా ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దీనిని బట్టి వారు ఆశీర్వదింపబడిన వారుగా నుందురు.

గ్రంథకర్త : జెకర్యా. పరిశుద్ధ గ్రంథములో జెకర్యా అను పేరుగలవారిని సుమారు ముప్పది మందిని చూడగలము. మగ సంతానము కలిగినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకొనుటకు గుర్తుగా వారికి ఈ పేరు పెట్టబడియుండును. తన పితరులైన యిర్మీయాయెహెజ్కేలు వంటి వారివలె ఈయనయు యాజక కుటుంబములో జన్మించిన ఒక యాజకుడు. ఈయన బెరక్యా కుమారుడు. ఇదోకు మనుమడు. (జెకర్యా 1:1-7ఎజ్రా 5:1ఎజ్రా 6:14నెహెమ్యా 12:4-16దేవుడు ఈయనను బాల్యములోనే పిలిచి ప్రవక్తగా ప్రత్యేకించుకొనెను. బెరక్యా కుమారుడైన ఈ జెకర్యా - యూదా పారంపర్య ప్రకారము లేఖనములను సమకూర్చు దేవాలయ సంఘ సభ్యులలో ఒకడుగా నుండెను. ఈయన దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య మిక్కిలి దారుణముగా చంపబడెను. (మత్తయి 23:35మరియొక జెకర్యాయును ఇదే విధముగా హత్య గావింపబడెను. (2 దినవృత్తాంతములు 24:20-21) జెకర్యా గ్రంథమును సంపూర్ణముగా వ్రాసినవాడు బెరక్యా కుమారుడైన జెకర్యాయేనని యూదా పారంపర్యము, క్రైస్తవ పారంపర్యము సాక్ష్యమిచ్చుచున్నది.

కాలము : క్రీ.పూ. 480 - 470 మధ్య కాలమని భావింపబడుచున్నది.

ముఖ్య పదసముదాయము : మెస్సీయ కొరకు సిద్ధపడుడి.

ముఖ్య వచనములు : జెకర్యా 8:3జెకర్యా 9:9.

ముఖ్య అధ్యాయము : 14. జెకర్యా ప్రవచనము ఈ 14వ అధ్యాయము శ్రేష్ఠమైన ఒక అంశమును చెప్పుచున్నది. యెరూషలేము ముట్టడింపబడుట, ఇశ్రాయేలీయుల విరోధులు మొదటిగా విజయము పొందుటను వివరించిన తరువాత ఒలీవల కొండ రెండుగా విడిపోవుటయు, యెరూషలేము యెహోవా చేత రక్షింపబడుటయు జరుగును. యెహోవా దర్శనము జరుగును. అన్యజనులు దేవుని తీర్పుననుసరించి శిక్షింపబడుదురు. ఇశ్రాయేలు దేశము పూర్వ ఔన్నత్యమును పొందును. యూదా పునరుద్ధరింపడును. దేవుడేర్పరచిన పర్ణశాలల పండుగ ఆచరింపబడును. యెరూషలేము ప్రతిష్టిత పట్టణమగును. మున్నగు అంశములన్నియు ఈ అధ్యాయమునందు వర్ణింపబడెను.

గ్రంథవిభజన : ఈ గ్రంథములోని మొదటి 8 అధ్యాయములు దేవాలయమును నిర్మించుటకు యూదులకు ఇవ్వబడిన ప్రోత్సాహములు. తరువాత వచ్చు 6 అధ్యాయములు - దేవాలయ నిర్మాణము పూర్తియైన పిమ్మట మెస్సీయ రాకడ కొరకు ప్రజలు ఎదురు చూచుటకు తోడ్పడు హితోపదేశములు. అన్యజనుల పాలనలో నుండి మెస్సీయ పరిపాలనలోనికిని, శ్రమలలో నుండి సమాధానము లోనికిని, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికిని యూదులను తెచ్చుగొప్ప మార్పులు ఈ చివరి భాగములో చెప్పబడినవి. గ్రంథములో వ్యక్తపరచబడిన మూడు భాగములు ఈ క్రింది విధముగానున్నవి.

  1. ఎనిమిది దర్శనములు : 1 - 6 అధ్యాయములు 2. నాలుగు వర్తమానములు : 7, 8 అధ్యాయములు 3. రెండు హృదయ భారములు : 9 - 14 అధ్యాయములు

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 38వ పుస్తకము. అధ్యాయములు 14; వచనములు 211; ప్రశ్నలు 27; ఆజ్ఞలు 35; వాగ్దానములు 4; హెచ్చరికలు 226; ప్రవచన వాక్యములు మొత్తము 122; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనున్న ప్రవచనములు 91; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 59.


మరిన్ని వివరములు: ప్రవక్త జెకర్యా బైబిల్‌లో ఒక ముఖ్యమైన వ్యక్తి, మరియు అతను ప్రధానంగా పాత నిబంధనలో కనిపించే అతని ప్రవచనాత్మక రచనలకు ప్రసిద్ధి చెందాడు. అతను హీబ్రూ స్క్రిప్చర్స్‌లోని పన్నెండు మంది చిన్న ప్రవక్తలలో ఒకడు మరియు అతని పుస్తకం, "జెకరియా", క్రైస్తవ బైబిల్ యొక్క పాత నిబంధనలో పదకొండవ పుస్తకం.

6వ శతాబ్దం BCE చివరిలో జరిగిన బాబిలోనియన్ చెర నుండి జెరూసలేంకు బహిష్కరించబడిన ఇశ్రాయేలీయులు తిరిగి వస్తున్న కాలంలో జెకర్యా జీవించాడు. అతను మరొక ప్రవక్త హగ్గై యొక్క సమకాలీనుడు మరియు బాబిలోనియన్ ఆక్రమణ సమయంలో ధ్వంసమైన జెరూసలేంలోని ఆలయాన్ని పునర్నిర్మించడానికి యూదా ప్రజలను ప్రోత్సహించడంలో మరియు మార్గనిర్దేశం చేయడంలో వారు కలిసి కీలక పాత్ర పోషించారు.

జెకర్యా ప్రవచనాల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం యూదు సమాజాన్ని దేవునిపై వారి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, ఆలయాన్ని పునర్నిర్మించడానికి మరియు అతనితో వారు కలిగి ఉన్న ఒడంబడికకు నమ్మకంగా ఉండటానికి ప్రేరేపించడం. అతని ప్రవచనాలలో నిరీక్షణ, పునరుద్ధరణ మరియు భవిష్యత్ మెస్సీయ వాగ్దానానికి సంబంధించిన సందేశాలు కూడా ఉన్నాయి.

జెకర్యా పుస్తకం రెండు ప్రధాన విభాగాలుగా విభజించబడింది:

1. 1-8 అధ్యాయాలు: ఈ అధ్యాయాలు జెకర్యా దేవుని నుండి పొందిన దర్శనాలను కలిగి ఉన్నాయి. ఈ దర్శనాలు తిరిగి వచ్చే ప్రవాసులకు ప్రోత్సాహకరమైన సందేశాలుగా పనిచేస్తాయి మరియు ప్రతీకాత్మక మరియు ప్రవచనాత్మక చిత్రాలను కలిగి ఉంటాయి.

2. అధ్యాయాలు 9-14: ఈ విభాగంలో మెస్సీయ రాకడ మరియు భూమిపై దేవుని రాజ్య స్థాపనతో సహా భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించిన ప్రవచనాలు మరియు ప్రవచనాలు ఉన్నాయి.

జెకర్యా ప్రవచనాలలోని కొన్ని ముఖ్యాంశాలు ఆలయ పునర్నిర్మాణం, ఇజ్రాయెల్ యొక్క ఆధ్యాత్మిక పునరుద్ధరణ, దేవుని ప్రజల భవిష్యత్తు విజయం, మెస్సీయ యొక్క భవిష్యత్తు పాలన మరియు దేశాలపై దేవుని అంతిమ విజయం.

మొత్తంమీద, ప్రవాస అనంతర కాలంలో ప్రవక్త జెకర్యా యొక్క రచనలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పట్ల వారి నిబద్ధతను పునరుద్ధరించడానికి మరియు జెరూసలేంలో వారి మతపరమైన పద్ధతులను పునఃస్థాపించడానికి వారిని ప్రేరేపించడంలో మరియు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతని ప్రవచనాలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రాకతో నెరవేరిన మెస్సియానిక్ అంచనాలకు కూడా పునాది వేసింది.




Share this post