Skip to Content

జెకర్యా గ్రంథం

  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

అధ్యాయాలు : 14, వచనములు : 211

గ్రంథకర్త : జెకర్యా.

రచించిన తేది : దాదాపు క్రీ.పూ 500-470 సం.

మూల వాక్యాలు :

1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

7:13 కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను.

9:9 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.

13:9 ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

రచించిన ఉద్ధేశం: యెహోవా దేవుడు తాను నియమించిన ప్రవక్తలద్వారా తాను ఏర్పరచుకొనిన ప్రజలకు బోధించుటకు, హెచ్చరించుటకు, చక్కదిద్దుటకు వాడుకుంటాడు అని జెకర్యా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అయితే ఆ ప్రజలే గైకొనలేని వారుగా ఉంటున్నారు. ఆ అవిధేయతవలననే వారు శిక్షకు పాత్రులైరి. అయితే కొన్ని సందర్భాల్లో కూడా ప్రవచనం అవినీతికి పాల్పడుతుంది అని కూడా ఈ గ్రంథం లో నిక్షిప్తమైనది. నిబంధన కాలముల మధ్యలో ప్రవచనాలు యూదులకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో యే ప్రవక్త కూడా దేవుని వాక్కు తెలియ జేయడానికి లేడు అని చరిత్ర చెబుతుంది.

ఉపోద్ఘాతం: దాదాపు క్రీ.పూ. 722లో ఉత్తర రాజ్యామైన ఇశ్రాయేలు అష్షూరు సైన్యములకు లొంగిపోయి బాబులోను దాస్యములో 70 సం||లు నుండిరి. తరువాత దాదాపు క్రీ.పూ. 586లో పారశీక మహా సామ్రాజ్యము బాబులోనును జయించి, పారశీక సామ్రాజ్యపు నూతన విదేశీ విధానము మూలమున యుదులు స్వదేశమునకు మరలవలెనని, రాజైన నెబుకద్నేజరు నాశనము చేసిన దేవాలయములను పునర్నిర్మాణాలు-గావించవలెనని కోరేషు ఆజ్ఞ వెలువడెను.ఆ దేశపు అధికారియైన జెరుబ్బాబేలు మరియు యాజకుడైన యెహోషువ యొక్క న్యాయకత్వంలో సుమారు 50,000 మంది యూదాకు తిరిగివచ్చిరి వారిలో జెకర్యా ఒకడు. వారు తిరిగి వచ్చిన వెంటనే పూర్వప్రకారంగా బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించిరి మరియు రెండవ సంవత్సరమున దేవాలయమునకు పునాది వేసిరి (ఎజ్రా 3:1-6, 8-13,5:16) కాని వెలుపటి ఆటంకములు, లోపటి సమస్యల మూలముగాను దేవాలపు నిర్మాణము 16 సం. లు ఆటంకపరచబడింది. అటు తరువాత దాదాపు క్రీ.పూ. 522-586లో పారసిక దేశపు రాజైన దర్యావేషు పాలనలో దేవాలయ నిర్మాణం ప్రారంభమయింది. దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరమున క్రీ.పూ. 520లో యెహోవా హగ్గయిని దేవాలయ పనుల నిర్మాణమునకు ప్రోత్సాహించెను. హగ్గయి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వర్తమానములను అందించి తన పరిచర్యను ముగించుకొనెను. హగ్గయి తరువాత జెకర్యా పనిని చేపట్టెను. జెకర్యా అను పేరునకు “యెహోవా జ్ఞాపకము చేసుకొనెను” అని అర్ధము. జెకర్యా గ్రంధమంతా ఇదే భావముగల సందేశము. యెహోవా, తాను ఏర్పరచుకొన్న ప్రజల యెడల బహుగా కోపగించుకొనెనని మరియు వారు తమ దుష్క్రియలను మాని తమ నడతలను శుద్ధిచేసుకొనవలెనని ప్రవక్తయైన జెకర్యా ద్వారా వర్తమానము అందించెను. ఇశ్రాయేలీయుల మూల పితరులతో తాను చేసిన నిబంధనలను యెహోవా ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దీనిని బట్టి వారు ఆశీర్వదింపబడిన వారుగా నందురు.

రక్షణ అందరికి కలుగుతుంది అని జెకర్యా గ్రంధం యొక్క ముఖ్య ఉద్ధేశం. భూదిగంతములనుండి అనేకులు దేవుని ఆరాధించుదురు అనియు ఆయనను వెంబడించుదురు అని జెకర్యా ఆఖరి అధ్యాయాల ప్రకారం మనం గమనించగలం. అనగా అందరూ రక్షణ పొందుదురు “ఎందుకంటే అది దేవుని స్వభావం కాబట్టి” అనే సార్వత్రిక వాదం కాదు గాని జాతి మత కుల బేధాలు లేకుండా అందరూ రక్షింపబడాలి అని దేవుని యొక్క ముఖ్య ఉద్ధేశం. అయితే దేవుడొక్కడే సార్వభౌమాధికారం గలవాడు ఆయనకు విరోధమైనది ఏదీ అయన ముందు నిలువదు అని జెకర్యా ప్రవచించాడు. అయితే దేవుడు తాను చేయబోయే సంగతులను దర్శన రూపంలో జెకర్యా ద్వారా తెలియజేసి తాను లోకానికి ప్రకటించబోయే సంగతులను ఈ ప్రవక్త ద్వారా వివరించాడు. అంతేకాకుండా ఈ లోకము దాని సరిహద్దులు దేవుని అధీనములో ఉన్నవి అని చివరి అధ్యాయాలలో గమనించవచ్చు.

సారాంశం: పరిశుద్ధుడైన దేవుడు కేవలం నిష్కపటమైన ఆరాధనను మరియు మంచి నడవడిని మననుండి కోరుతున్నాడు. ఆయన యొక్క సత్య సువార్తను మనం ఇతరులకు తెలియజేయుటలో ఒక పనిముట్టు వలే పనిచేయవలెనని గ్రహించాలి.


Share this post