Skip to Content

హోషేయ

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు

మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారము పాలస్తీనా యొక్క మధ్య భాగములో ఎఫ్రాయీము గోత్రము యొక్క నివాసములుండెను. అనేక పరిస్థితులలో ఇశ్రాయేలీయుల పది గోత్రములలో ఎంతో ముఖ్యమైన గోత్రముగా ఎఫ్రాయీము గోత్రము పరిగణించబడి నందువలన ఉత్తరదేశమును ఎఫ్రాయీము అని హోషేయ పిలిచెను. హోషేయ అంటే రక్షణ అని అర్ధము. ఇశ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అను స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడెను. ఇశ్రాయేలీయుల విగ్రహారాధనకును, దేవునితో కలిగియున్న యదార్థత లేని స్థితికిని ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపకమైన పాఠముగా మార్చబడినది. హోషేయ ప్రవచనములో మూడు ముఖ్య భాగములు ఇమిడియున్నవి. 1. దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడు. 2. దేశము తీర్పు పొందడం నిశ్చయము. 3. తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏ మాత్రము మార్పు చెందనిది.

గ్రంథకర్త :

బెయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథము యొక్క గ్రంథకర్త. అని మొదటి వచనము హక్కుతో మెచ్చుకొనుట ఎవరు కాదనలేరు. ఆయన జన్మించిన ప్రదేశము ఏది అని ఎక్కడా వ్రాయబడలేదు. అయినను ఉత్తర దేశమైన ఇశ్రాయేలుతో నిరంతర సంబంధము కలిగిన వాడుగా నుండినందున ఆయన జన్మించిన స్థలము యూదా కాదుగాని ఇశ్రాయేలుగా ఉండి ఉండవచ్చును. హోషేయ 7:5 లో ఇశ్రాయేలు రాజును గూర్చి మన రాజు అని చెప్పుట ఈ తలంపును నిర్ధారణ చేయుచున్నది. భార్య గోమెరును ఇద్దరు కుమారులును, ఒక కుమార్తెయు కలిగిన కుటుంబముగా కనబడెను. (హోషేయ 1:1-9) పరిశుద్ధ గ్రంథములో ఇతర స్థలములన్నీటిలో ఆయనను గూర్చిన వర్తమానము ఏవియును తెలిసికొనుటకు తరుణము లేదు.

     తమ దేశ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మోసము, నరహత్యలు, అబద్ధము, కృతజ్ఞతలేని స్థితి, విగ్రహారాధన, దురాశ అనువాటినన్నింటిని గూర్చి హెచ్చరించుచున్నాడు. అయినను ఆయన వార్త మిక్కిలి కరుణతో కూడినదై నమ్మకముతో నింపబడినదిగానున్నది. హోషేయ తమ స్వంత జీవితములో వ్యభిచార జీవితమును జీవించిన భార్య గోమెరు ద్వారా అనుభవించిన దుఃఖము ఆయన హృదయమును కనికరముతో నిండియుండియుండవచ్చును.

కాలము :- హోషేయ 1:1 లో చూచిన రీతిగా ఉజ్జీయాయోతాము ఆహాజు హిజ్కియా మొదలైన యూదా రాజులకాలములోను, రెండవ యరొబాము అను ఇశ్రాయేలీయుల రాజు కాలములోనే హోషేయ తన సేవను నెరవేర్చెను. ఇశ్రాయేలీయులలో మరియొక ప్రవక్తగా యుండిన ఆమోసుయూదా ప్రవక్తగా నుండిన

యెషయామీకా, అనువారి యొక్క కాలములో నుండిన ప్రవక్తగా ఈయన ఉంటున్నాడు. హోషేయ యొక్క దీర్ఘకాల ప్రవచనము రెండవ యరొబాము కాలములోను తరువాత ఇశ్రాయేలీయుల రాజు యొక్క చివరి కాలములో పరిపాలించిన జెకర్యా నుండి హో షేయ వరకు గల ఆరుగురు రాజుల కాలములోను

కొనసాగెను. ఆయన సేవాకాలము దాదాపుగా క్రీ.పూ 755 నుండి క్రీ.పూ 710 వరకు అని ఊహించవచ్చును. క్రీ.పూ 710 సంవత్సరముమునకు సమీపించిన హిజ్కియా పరిపాలనా కాలములో హో షేయ తన ప్రవచనా గ్రంథమును వ్రాసినట్లుగా తీసుకోవచ్చును. తన ప్రవచనా సేవ యొక్క నలుబది సంవత్సరముల కాల కార్య క్రమములతో నిండినది హోషేయ గ్రంథము.

     హోషేయ సేవ ప్రారంభకాలములో ఇశ్రాయేలు రెండవ యరొబాము యొక్క పరిపాలన క్రింద సమృద్ధికలిగియుండెను. అయినను మూడవ తిగ్లత్పిలెసెరు యొక్క (క్రీ.పూ 745 - 727 ) పరిపాలనలో అష్హూరు ఎంతో ప్రఖ్యాతిగాంచిన వెంటనే ఇశ్రాయేలు పతనము వైపు సాగెను. చివరి ఆరుగురు రాజుల పరిపాలనా కాలములో ఎంతో క్లుప్తమైనవిగా నుండెను. వారిలో నలుగురు చంపబడిరి. 5వ రాజు బానిసగా అష్హూరుకు కొనిపోబడెను. ఉత్తర దేశపు రాజు యొక్క చివరి దినములు కలవరముతోను, వెనుకంజవేయు స్థితితో నిండినదిగా నుండినవి. అధర్మము విగ్రహారాధన ద్వారా ప్రజలు ఆత్మీయ గ్రుడ్డితనములో జీవించిరి.

ముఖ్యమాట : తిరుగుట, అధర్మము, విగ్రహారాధన విడిచి పెట్టి యెహోవా వైపు తిరుగుటకు ఆహ్వానము ఈ ప్రవచనా గ్రంథమంతటిలో మ్రోగడము మనము వినగలము.

ముఖ్య వచనములు : హోషేయ 4:1హోషేయ 11:7-9

ముఖ్య అధ్యాయము : హోషేయ 4

     ఇశ్రాయేలీయులు సత్యమును గూర్చిన జ్ఞానమును విడిచి అన్యులయొక్క విగ్రహారాధనను వెంబడించిరి. నా జనములు జ్ఞానము లేనివారైనశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును అని హోషేయ 4:6 లో చూచుచున్న మాటలు హోషేయ ప్రవచనా వర్తమానము యొక్క ముఖ్యాంశమైయున్నది.

విభజన : యూదా దేశపు చివరి దినములలో యిర్మీయా చేసిన ప్రవచనా సేవతో ఇశ్రాయేలు యొక్క చివరి దినములలో దేవుని శుభవర్తమానమును ప్రకటించిన హోషేయ సేవను సరిపోల్చివచ్చును. శీలసంబంధముగా, యదార్థతలేని స్థితిని పడిపోవుచున్న ఇశ్రాయేలీయులు తిరిగి తన వైపు తిప్పుకొనుటకు దేవుడు చేసిన చివరి ప్రయాసమని దీనిని మనము ఊహించవచ్చును. భార్య భర్త బాంధవ్యములో ఒక్కరు మాత్రము యదార్థముగా ప్రేమలో నిలిచిన హోషేయ యొక్క స్వంత జీవితమువలె ఇశ్రాయేలుకు దేవుని గల సంబంధము కనబడినది. హోషేయ కుటుంబ జీవితములో కనబడిన దుర్మార్గాస్థితి ఇశ్రాయేలు దేశమునకు ఏర్పడిన దుర్మార్గస్థితికి చిత్రపటముగా పరిగణింపబడుచున్నది. గోమెరు అన్య ప్రజలను వెంబడించినట్లుగా ఇశ్రాయేలు అన్యదేవతలను వెంబడించెను. హోషేయ గ్రంథమును ఈ రెండు గొప్ప భాగములుగా విభజించవచ్చును.

  1. దుర్మార్గముతో నిండిన భార్యయు యధార్థతగల భర్తయు అధ్యా 1 - 3.
  2. విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలును యదార్ధతగల దేవుడును 4 -14.

     మానవులు పాపములో పడి యదార్థత లేనివారుగా మారినపుడు, యదార్థత, ప్రేమ అనువాటిలో మార్పు లేనివాడును. వారి ఉజ్జీవము కొరకు ప్రేమతో కని పెట్టుచున్న దేవుని యొక్క స్వభావము ఈ గ్రంథములో మనము చూచుచున్నాము.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 28వ గ్రంథము, అధ్యాయములు 14; వచనములు 197; ప్రశ్నలు 16; ఆజ్ఞలు 26; వాగ్దానము 10; హెచ్చరికలు 298; ప్రవచనా వచనములు 152; నెరవేరని ప్రవచనములు 17; నెరవేరిన ప్రవచనములు 134; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10.


Share this post