Skip to Content

హబక్కూకు

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

యూదామరల మృత్యుముఖమును సమీపించుచున్న కాలములో హబక్కూకు ప్రవక్త ప్రవచించెను. మారుమనస్సు పొందుడని పలుమారు ఆహ్వానింపబడినను జనులు గర్విష్టులై వంగని మెడ గలవారై పాప మార్గములను విడువక వెంబడించుచుండిరి. తన దేశమున నెలకొనియున్న ఈ భయంకర దుస్థితిని చూచి ప్రవక్త యెహోవా ఇది ఎంత కాలము కొనసాగును అను ప్రశ్నను లేపుచున్నాడు. (హబక్కూకు 1:2హబక్కూకు 1:13-14) తమ మీదికి రానున్న శిక్షను నెరవేర్చు ఆయుధములుగా బబులోనీయులు తన చేతిలో నుందురని దేవుడు జవాబివ్వగా - ప్రవక్త భయపడి వణకుచు తనకు తెలియకుండానే మోకాళ్లూని ప్రార్థన ప్రారంభించెను. అంతట ఏతరమునకు చెందిన వారైనను - నీతిమంతుడు చూపుద్వారా కాక విశ్వాసమూలముగా బ్రదుకును అను సత్యమును దేవుడాయనకు బయలుపరచెను. దేవుని మార్గములు తనకు సంపూర్ణముగా తెలియబడనప్పటికి హబక్కూకు సాటిలేని దేవుని జ్ఞానమును కీర్తించి స్తుతిగానము చేయుచున్నాడు. హబక్కూకు అను అసాధారణమైన హెబ్రీనామధేయము - కౌగలించుకొనుట అను అర్థమిచ్చు హబక్ అను హెబ్రీ క్రియా పదము నుండి ఉద్భవించినది. కౌగలించుకొనువాడు లేక గట్టిగా పట్టుకొనువాడు అని ఈ నామమునకు అర్ధము. దేవునిని గట్టిగా పట్టుకొనిన ఈ ప్రవక్త ఇదే భావమును హబక్కూకు 3:16-19 వాక్యముల ద్వారా వివరించుచున్నాడు.

గ్రంథకర్త : హబక్కూకు 1:1హబక్కూకు 3:1 లను బట్టి దీని గ్రంథ కర్త హబక్కూకు అని స్పష్టమగుచున్నది. హబక్కూకు వృత్తి ప్రవచించుటయని ఈ వాక్యములు తెలియజేయుచున్నవి. 3వ అధ్యాయము ఒక ప్రార్థనా గీతము. దీని చివరి భాగములో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది అని వ్రాయబడుటను బట్టి హబక్కూకు యెరూషలేములో జరుగు ఆరాధనలతో సంబంధము గలిగియున్న ఒక యాజకుడైయుండవచ్చునని మనము తలంచవచ్చును. ఆయన తనకుటుంబమును గూర్చియైనను తన దేశనమును గూర్చియైనను ఏమియు చెప్పలేదు. ఈయనకు దానియేలుతో సంబంధముగలదని కొందరు అభిప్రాయపడుచున్నారు.

హబక్కూకు కాలము : హబక్కూకు కాలము యొక్క గుర్తింపులను, జరుగనైయున్న బబులోను దండయాత్రను గూర్చి ఈ గ్రంథములో వ్రాయబడిన వర్తమానముల నుండి మాత్రమే గ్రహించగలము. (హబక్కూకు 1:6హబక్కూకు 2:1హబక్కూకు 3:16హబక్కూకు గ్రంథము వ్రాయబడిన కాలము మనష్హే పాలనా కాలము ( క్రీపూ 697 - 642 ) అని కొందరు బైబిలు పండితులును, ఆమోను పాలనా కాలము (క్రీ. పూ. 642 - 640 ) అని మరికొందరు బైబిలు పండితులు అభిప్రాయపడుచున్నారు. అయితే ఈ ఇరువురు రాజుల కాలములో బబులోను అషూరు రాజులు పాలించిన భాగములలో ఒకటిగా ఉన్నందున ఈ ఊహలు పునాదులు లేనివిగా నున్నవి. క్రీ.పూ. 640 - 609 పాలించిన ఉత్తమ రాజైన యోషియా కాల పరిస్థితులు హబక్కూకు ప్రవచనములకు సరిపడలేదు. క్రీపూ 609 - 598 కాలములో యూదాను పరిపాలించిన భక్తి హీనుడైన రాజైన యెహోయాకీము కాలము మాత్రమే హబక్కూకు ప్రవచనమునకు సరిపోవుచున్నది. ఈ రాజే యూదాను నాశనపుటంచుల వరకు దుష్టత్వములో నడిపించాడు. (2 రాజులు 23:342 రాజులు 24:5 యిర్మియా 22:17) నా బోసాలాసర్ (నెబూజరదాను)? అను రాజు కాలములో (క్రీ.పూ. 626 - 605) బబులోను బలపడనారంభించెను. అతడు క్రీ.పూ 612లో అషూరు రాజధానియైన నీనెవేను నాశనము గావించెను. నాబా సాలాసర్ తరువాత రాజైన నెబుకద్నెజరు క్రీ.పూ 605లో సింహాసన మెక్కెను. ఆయన తన పరిపాలన ప్రారంభమైన మొదటి సంవత్సరములోనే యూదాపై దండెత్తాడు. దానిని స్వాధీనము చేసుకొని రాజకుటుంబీకులలో 10,000 మంది అధిపతులను చెరపట్టి బబులోనుకు తీసికొని వెళ్లాడు. పేదలను వంఛించిన అధిపతులే మొదటిగా ఖైదీలుగా పట్టబడ్డారు. హబక్కూకు బబులోను దండయాత్రకు ముందే ప్రవచించెను. గనుక క్రీ.పూ 607 కు సమీపములో ఈ గ్రంథము వ్రాయబడియుండవలెను.

ముఖ్య వచనము : “నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రదుకును"

ముఖ్య వచనములు : హబక్కూకు 2:4హబక్కూకు 3:17-19

ముఖ్య అధ్యాయము : 3 అధ్యాయము.

     హబక్కూకు గ్రంథములోని చివరి మూడు వచనములు (హబక్కూకు 3:17-19) ఈ గ్రంథమును మిక్కిలి ఔన్నత్య స్థానమునకు హెచ్చించుచున్నది. ఫిర్యాదులతోను, సందేహములతో, ప్రశ్నలతోను ప్రారంభమైన హబక్కూకు ప్రవచన గ్రంథము ముగింపులో ధృఢ నిశ్చయతతోను, విశ్వాసముతోను అంతమగుచున్నది. విశ్వాస విజయ విఖ్యాతమైన ఈ మూడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము అంతటిలో విశిష్ట స్థానము పొందుచున్నది.

గ్రంథ విభజన : ఈ గ్రంథములో రెండు భాగములు మిక్కిలి తేటగా కనబడుచున్నవి. హబుక్కూకు దేవుని యెదుట లేవనెత్తుచున్న సంశయాత్మక ప్రశ్నలును దానికి దేవుడు అనుగ్రహించిన జవాబులును మొదటి రెండు అధ్యాయములలోను, హబక్కూకు కృతజ్ఞతతో దేవునికి చేయు స్తోత్ర గీతము మూడవ అధ్యాయములోను వివరింపబడినవి.

(1) హబక్కూకు సంశయములు, ప్రశ్నలు, దేవుని జవాబులు: 1 , 2 అధ్యాయములు (a). హబక్కూకు మొదటి ప్రశ్న హబక్కూకు 1:1-4. (b). దేవుని జవాబులు హబక్కూకు 1:5-11 (c). హబక్కూకు రెండవ ప్రశ్న హబక్కూకు 1:12హబక్కూకు 2:1 (d). దేవుని రెండవ జవాబు హబక్కూకు 2:2-20

(2) హబక్కూకు స్తోత్రగీతము : 3వ అధ్యాయము

(a). దేవుని కృప కొరకు ప్రవక్త ప్రార్ధన హబక్కూకు 3:1-2 (b). దేవుని కనికరము స్మరించుట హబక్కూకు 3:3-15 (c). దేవుని రక్షణపై విశ్వాసముతో ఆనుకొనుట హబక్కూకు 3:16-19

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 35వ పుస్తకము. అధ్యాయములు 3; వచనములు 56; ప్రశ్నలు 12; ఆజ్ఞలు 1; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 20; ప్రవచన వాక్యములు 11; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2 (Hab,1,5-2,2).

 


Share this post