Skip to Content

ఎజ్రా

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

దినవృత్తాంతములు రెండవ పుస్తకము తరువాత జరిగిన చరిత్ర మార్పును కొనసాగిస్తూ 70 సంవత్సరముల చెరనివాసమునకు తరువాత దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశమునకు తిరిగి తీసుకొని వచ్చుటను గురించి చెప్పు పుస్తకము. ఇది బబులోను నుండి బయలుదేరి వచ్చు ఈ సంఘటనను రెండవ నిర్గమము అనవచ్చు. అయినప్పటికి ఈ రెండవ నిర్గమము మొదటి నిర్గమము వలె శ్రేష్ఠముగా ఉండలేదు. ఎందుకనగా బబులోనులో జీవించిన యూదులలో కొంత భాగము అంటే కొద్ది మంది మాత్రమే ఆ స్థలము వదలి తిరిగి వచ్చుటకు ముందుకు వచ్చిరి.

     బబులోనును వదలి బయలుదేరి వచ్చిన రెండు గుంపులను గూర్చి ఎజ్రా వివరించుచున్నాడు మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వములో దేవాలయమును కట్టుటకు, రెండవ గుంపు ఎజ్రా నాయకత్వములో ప్రజల భక్తి సంబంధమైన కార్యములలో తట్టిలేపుటకు స్వదేశమునకు తిరిగి వచ్చిరి. ఈ రెండు సంఘటనలకు మద్య సుమారు 60 సంవత్సరములు కాలవ్యవధియుండెను. ఈ మధ్య కాలంలో ఎస్తేరు పారసీక దేశ రాణిగా

యుండెను. మూల భాషయమైన హెబ్రీ భాష పరిశుద్ధ గ్రంథములో ఎజ్రానెహెమ్యా ఒకే పుస్తకముగా ఉండినవి. ఎందుకనగా ఈ రెండు పుస్తకములలో వరుసగా ఒకే చరిత్ర వ్రాయబడియున్నది. లాటిన్ పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా పుస్తకమునకు మొదటి ఎజ్రా అని, నెహెమ్యా పుస్తకమునకు రెండవ ఎజ్రా అని పేరు ఇవ్వబడినది.

ఉద్దేశము : తన ప్రజలను తిరిగి వారి దేశమునకు రప్పింపజేసెదను అనువాగ్దానమును నెరవేర్చుటలో దేవుడు ఎంత యదార్ధవంతుడుగా ఉండెనో చూపించుట.

గ్రంథకర్త : ఎజ్రా

కాలము : సుమారు క్రీ.పూ. 538 - 457. పారసీక రాజైన కోరెషు (సైరస్) క్రీపూ 539లో బబులోనును జయించెను. ప్రతి దేశస్తులకు వారి వారి మతాచారపు అలవాట్లకు అరాధన జరిగించుటకు స్వేచ్చ యివ్వబడవలెననునదే పారశీకుల పద్ధతి. ఇందువలననే క్రీ. పూ. 538లో కోరెషు

యెరూషలేము దేవాలయమును కట్టుటకు అజ్ఞయిచ్చెను. దైవభక్తి, త్యాగము గల యూదులు జెరుబ్బాబేలు నాయకత్వంలో యెరూషలేము దేవాలయము కట్టుటకు బయలుదేరిరి. క్రీ.పూ. 536లో వారు దేవాలయమునకు పునాదులు వేసి పని ప్రారంభించిరి. క్రీపూ 586లో యెరూషలేము నాశనము చేయబడిన తరువాత కేవలం 50 సంవత్సరములు మాత్రమే చెరకొనసాగినది. కాని చెర నివాస కాలము 70 సంవత్సరములుగా లెక్కింపబడుచున్నది. ఎలాగనగా ఈ ప్రజలు బబులోనుకు మొట్టమొదట చెరపట్టబడిన క్రీ.పూ. 605 నుండి లెక్కింపబడినది. దేవాలయపుపని క్రీ.పూ. 534లో ఆటంకపర్చబడిన తరువాత క్రీ. పూ. 520లో పునఃప్రారంభమైనది. క్రీ.పూ. 516లో పని ముగించబడినది. యూదా నుండి ప్రజలను చెరపట్టుకొని పోయినది మొదటిగా క్రీ. పూ. 605 లోను, 2వ సారి క్రీ. పూ. 597 లోను, 3వ సారి క్రీపూ 586లో జరిగినది.

నేపథ్యము: దినవృత్తాంత పుస్తకములవలె ఎజ్రా పుస్తకము కూడా యూదా ప్రజల చరిత్రను చెప్పుచున్నది. చెరనివాసం వచ్చిన తరువాత యూదులు స్వదేశనమునకు తిరిగి వచ్చుట ఈ పుస్తకము యొక్క సారాంశం.

ముఖ్యమైన వ్యక్తులు : కోరెషు, జెరుబ్బాబేలుహగ్గయి, జెకర్యా, దర్యావేషు, మొదటి అర్తహషస్తఎజ్రా.

ముఖ్య స్థలములు : బబులోనుయెరూషలేము.

గ్రంథ విశిష్టత : ఎజ్రానెహెమ్యా, హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఒకే పుస్తకముగా ఉండినవి. ఈ రెండు పుస్తకములలో, ఎస్తేరు పుస్తకమును చేర్చినట్లైతే చెర నివాసము తరువాత కాలపు చరిత్ర పుస్తకములగును.

పుస్తకపు ముఖ్య భాగములు : ముఖ్యమైన వాక్యము, దేవాలయము సారాంశము: - దేవాలయమును తిరిగి కట్టుట, దైవ ప్రజల ఆత్మీయ, సమాజిక క్రమశిక్షణను సంస్కరించుట.

ముఖ్య వచనములు : ఎజ్రా 1:3ఎజ్రా 7:10

ముఖ్యమైన అధ్యాయము : ఎజ్రా 6 దేవాలయము కట్టి ముగించిన తరువాత దాని ప్రతిష్ఠితను గూర్చి చెప్పు అధ్యాయము. ఇది పస్కా ఆచరించుటకు, అన్యజనుల అపవిత్రతను వదలి దేవునికి లోబడుటకు, లోబడి ఒక పరిశుద్ధ జీవితము జీవించుటకు ప్రజలు ప్రోత్సహింపబడిరి.

గ్రంథ విభజన : ఎజ్రా పుస్తకమును 2 పెద్ద భాగములుగా విభజించవచ్చును. 1 - 6 అధ్యాయముల వరకు ఉన్న మొదటి భాగము దేవాలయమును తిరిగి కట్టబడుటను గురించి, 7 - 10 అధ్యాయములలో ఉన్న రెండవ భాగం ప్రజల ఆత్మీయ సంస్కరణలను గురించి చెప్పుచున్నది.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 15 వ పుస్తకము ; అధ్యాయములు 10; వచనములు 280; ప్రవచనములు లేవు; దేవుని నుండి ప్రత్యేక సందేశములు లేవు; వాగ్దానములు లేవు; ప్రశ్నలు 9; ఆజ్ఞలు 43.

 


Share this post