Skip to Content

దినవృత్తాంతములు రెండవ గ్రంథము

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఉద్దేశము : రాజులకు తీర్పునిచ్చే కొలబద్ద చూపించుచూ, నిజమైన ఆరాధనకు మనుష్యులను ఐక్యపరచుట, యూదాలోని నీతి మంతులైన రాజులను వారి యొక్క పరిపాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుట. చెడు రాజుల పాపములను బహిరంగముగా చూపించుట.

గ్రంథకర్త : ఎజ్రా (యూదా పారంపర్య నమ్మకమును బట్టి).

కాలం : క్రీ.పూ. 430 ( సొలొమోను పరిపాలన ప్రారంభమైన క్రీ. పూ. 970 నుండి బబులోను చెర ప్రారంభమైన క్రీ.పూ. 586 వరకు జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).

నేపథ్యము: ఒకటి, రెండు రాజుల రెండు పుస్తకముల ఉన్న చరిత్రను దినవృత్తాంతముల రెండవ పుస్తకములో వివరించుచున్నది. ఉత్తర భాగము ఇశ్రాయేలు అని దక్షిణ భాగము యూదా అని విభజింపబడిన దానిలో ఉత్తర ఇశ్రాయేలు దేశము మరియు అక్కడ ఏలిన రాజులను గురించిన చరిత్ర యించుమించు పూర్తిగా ఈ పుస్తకములో తీసివేయబడినది. ఈ పుస్తకము వ్రాయబడిన కాలంలో అధర్మం, విగ్రహారాధన వలన నాశనమైపోయిన ఆదేశములో యేదియును మిగలలేదు. దాని చరిత్రను వ్రాసి సమయమును వ్యర్థము చేయకూడదని గ్రంథకర్త తీర్మానము.

     దీనికి బదులుగా దేవాలయమును కట్టుటకు అనుమతిని పొంది తిరిగి వచ్చిన దైవ ప్రజలైన యూదా ప్రజలకు ఆత్మీయ ప్రోత్సాహము ఇచ్చుటకు వారి గత కాలపు మహిమను గూర్చిన గర్వమును, భవిష్యత్తును గురించిన మంచి నమ్మికను వారిలో పెంచటానికి ఈ పుస్తకము ద్వారా గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. దైవభక్తి లో ఉన్నతముగా ఉండిన దావీదు రాజు కాలము తరువాత ఆయన వారసులుగా పరిపాలన సాగించిన ఎనిమిది మంది ఉత్తమమైన రాజుల చరిత్రను, వారి యొక్క సంస్కరణలను వివరించుటకు పుస్తకములోని అధిక భాగమును గ్రంథకర్త ఉపయోగించాడు. తమ దేశము స్థిరపరచబడుటకు దైవ ఆరాధన ప్రాధమిక పునాది అనుకొని గ్రంధకర్త యెరూషలేము దేవాలయ మహిమ అక్కడ జరిగిన ఆరాధనను నొక్కి చెప్పుచున్నాడు గ్రంథకర్త.

ముఖ్యవచనము : 2 దినవృత్తాంతములు 7:14

ముఖ్య వ్యక్తులు : సొలొమోనుషేబారాణి, రెహబాముఆసాయెహోషాపాతు, యెరొబాము, యోవాషు, ఉజ్జియా, అహాజు, హిజ్కియా, మనషె, యోషియా.

ముఖ్యస్థలము : యెరూషలేము

గ్రంథ విశిష్టత : దేవాలయపు పనివివరములు వ్రాయబడినవి

గ్రంథ విభజన : (1). సొలొమోను పరిపాలనా కాలము : 1 నుండి 9 వరకు ఉన్న అధ్యాయములు, సొలొమోను పరిపాలనా కాలము సమాధానము, ధన సమృద్ధి, ఆరాధన అనువాటి యొక్క స్వర్ణయుగముగా ఉండినది. ఈ కాలములో యూదా ఐకమత్యములో, ధన సమృద్ధిలో ఉన్నత స్థానములో ఉండినది. సొలొమోను యొక్క ఐశ్వర్యము, జ్ఞానము, రాజభవనము, దేవాలయము అనునవి ఈ కాలములో ప్రఖ్యాతిగాంచినవి. ఈ భాగము యొక్క 9 అధ్యాయములలో మొదటి ఆరు అధ్యాయములు దేవాలయపు కట్టడపు పని, అర్పణ అనువాటిని కేంద్రముగా చేసుకున్నవి అనునది గమనించదగినది. (2). యూదా రాజుల యొక్క పరిపాలన : అధ్యాయము 10 - 36 వరకు దురదృష్టకరముగా ఇశ్రాయేలు మహిమ, ఐశ్వర్యము ఎక్కువ కాలము నిలువబడలేదు. సొలొమోను మరణము తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు అయిన వెంటనే దేశము రెండుగా విడిపోయినది. విభజన ఫలితముగా ఏర్పడిన రెండు రాజ్యముల మధ్య పోరాటము వచ్చినది. కొంచెము కొంచెముగా తమ నాశనము దిగజారిపోయినవి. అప్పుడప్పుడు వచ్చిన కొందరు ఉత్తములైన యూదా రాజుల ఆత్మీయ సంస్కరణల వలన నాశనమగుటకు కొంచెము ఆలస్యయినది. యూదాను పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది ప్రజలను విగ్రహారాధన నుండి, క్రమశిక్షణా రాహిత్యము నుండి పైకి లేపుటకు ప్రయత్నించిరి. అయిననూ ఎవరి ప్రయత్నమైననూ ఒక తరము కంటె మించి నిలువబడినట్లుగా కనబడలేదు.

     చివరిగా యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల పాలన కాలములో దేశమునకు పూర్తిగా నాశనము వచ్చినది. మూడుసార్లు బబులోను రాజులు యూదా ప్రజలను, రాజులను చెరపట్టి తన దేశమునకు తీసుకువెళ్ళిరి. చివరిసారి అంటే క్రీ. పూ. 586లో యెరూషలేము నగరము, దేవాలయము పూర్తిగా నాశనమైనవి. అయినప్పటికిని 70 సంవత్సరముల బానిసత్వము తరువాత అప్పటి పారశీక రాజైన కోరెషు (ఈ విరామ కాలములో బబులోను రాజ్యము ముగింపై మాదీయ పారశీక సామ్రాజ్యము స్థాపించబడినది. యూదులు తమ దేశమునకు మరలుటకును, యెరూషలేము దేవాలయము కట్టుటకు, ఆజ్ఞాపించెను. “ఆయన ప్రజలందరిలో ఎవడు ఉన్నాడో వాడు వెళ్ళవచ్చును వాని యొక్క దేవుడైన యెహోవా వానికితోడై ఉండునుగాక” అనునది ఆజ్ఞ యొక్క సారాంశము.

క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 14వ గ్రంథము ; అధ్యాయములు 36; వచనములు 822; చరిత్ర సంబంధమైన వచనములు 583; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనివి 7; హెచ్చరికలు 42; ఆజ్ఞలు 45; వాగ్దానములు 8 ; దేవుని ప్రత్యేక సందేశములు 21; ప్రశ్నలు 47.

 


Share this post