Skip to Content

దినవృత్తాంతములు మొదటి గ్రంథము

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

సమూయేలు రెండవ గ్రంథము మొదలుకొని రాజులు రెండవ గ్రంథము వరకు చెప్పబడిన యూదా చరిత్ర యొక్క పలు కోణముల మరులిఖితమైయున్నది. అయినను ఇది మరొకసారిచెప్పుట కాదు. ఇశ్రాయేలు చరిత్రకు దేవుడు ఇచ్చిన ఒక వివరణ అని దీనిని చెప్పవచ్చు. రెండవ సమూయేలు, మొదటి, రెండవ రాజులు ఇశ్రాయేలీయుల సంపూర్ణ రాజకీయ చరిత్రగా కనబడుచుండగా, దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజ కుటుంబమును మాత్రము ఒక మత చరిత్రగా దినవృత్తాంతముల పుస్తకములు వ్రాయబడినవి.

     సమూయేలు, రాజులు అనే పుస్తకముల వలె ఈ పుస్తకములు కూడా హెబ్రీ భాషలో ఒకే పుస్తకముగా వ్రాయబడిననూ గ్రీకు “సెప్టోజెంట్ " తర్జుమాలో రెండుగా విభజించబడినవి. దీని మొదటి పుస్తకములో దావీదు జీవిత చరిత్రను, రెండవ పుస్తకములో దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజకుటుంబ చరిత్ర వరకు కనబడుచున్నది. దావీదు వంశావళి వివరణలో మొదటి పుస్తకము ప్రారంభమగుచున్నది. ఆయన యొక్క న్యాయపరిపాలన, ఆత్మీయ శ్రేష్ఠతను ప్రత్యక్షపరచి అది ముగియుచున్నది.

     దినవృత్తాంతముల గ్రంథము హెబ్రీ గ్రంథములో చివరి పుస్తకములైనందున 1 నుండి 9 అధ్యాయములలో కనిపించే విశేష వంశావళి యొక్క వివరణ క్రొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకములో కనిపిస్తున్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళికి ప్రారంభమని చెప్పవచ్చును.

     దినవృత్తాంతముల పుస్తకము హెబ్రీ భాష శీర్షికమైన "డిబారెహయామిమ్” అనుమాటకు అనుదిన కార్యక్రమములు అని అర్థము ఇది గ్రాహ్యమగునట్లుగా తెలుగులో తీసుకొనబడిన మాటే ఈ దినవృత్తాంతములు.

ఉద్దేశము : దేవుని ప్రజలను ఐక్యపరచడం, దావీదు వంశావళిని వ్రాయుట, సమాజములోను, వ్యక్తిగత జీవితములోను నిజమైన ఆరాధనకు ప్రథమ స్థానం ఇవ్వబడవలెనని చెప్పుట.

గ్రంథకర్త : ఎజ్రా, (యూదా పారంపర్య నమ్మికనుబట్టి)

వ్రాసిన కాలము : క్రీ.పూ. 430 (క్రీ.పూ. 1000 - 960 కాలములో జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).

నేపథ్యము : రెండవ సమూయేలు వివరణగా ఈ పుస్తకమును చెప్పవచ్చును. యూదా మరియు ఇశ్రాయేలు మత చరిత్రకు దీనిలో ప్రాముఖ్యత ఇవ్వబడినది. చెర తరువాత ఒక మత గురువు (యాజకుని) నేతృత్వములో ఈ పుస్తకము వ్రాయబడినది.

ముఖ్యవచనము : 1 దినవృత్తాంతములు 14:2

ముఖ్యమైన వ్యక్తులు : దావీదుసొలొమోను

ముఖ్య స్థలములు : హెబ్రోనుయెరూషలేము

గ్రంథ విభజన : బబులోను చెర నుండి తిరిగి వచ్చు వరకు ఇశ్రాయేలు గురించి మొత్తం చరిత్రకు ఇంకొక ప్రతి బింభముగా ఉన్నది. ఇశ్రాయేలులో తిరిగివచ్చిన శేష దైవ ప్రజలకు వారి యొక్క పాతకాలపు జీవితమును గురించిన ఒక ఆత్మీయ దృష్టిని ఇచ్చుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. ఈ మొదటి పుస్తకము అంతయు సమూయేలు రెండవ పుస్తకము వలె దావీదు జీవిత చరిత్రను వివరించుటకు ఉపయోగపడుచున్నది. ఈ క్రింది విధముగా రెండు ముఖ్య భాగములను ఈ పుస్తకములో చూడవచ్చును.

(1). అధ్యాయము 1 నుండి 9 వరకు దావీదు వంశావళి పట్టిక. ఈ భాగములో దావీదు మరియు ఇశ్రాయేలీయుల పూర్వీకుల పారంపర్య ప్రారంభము నుండి ఇవ్వబడినది. పుస్తకము పూర్తిగా యూదా రాజ్య చరిత్రతో నిండిన యూదాబెన్యామీను అను గోత్రములకే ముఖ్యత్వము ఇచ్చి ఈ పూర్వీకుల పట్టిక ఉద్భవించబడినది. ఈ పుస్తకములో యాజక ప్రాథమిక దృష్ట్యా లేవీ గోత్రమునకు ఉన్నతమైన స్థానము ఇవ్వబడినది.

(2). అధ్యాయము 10 - 29 వరకు. దావీదు జీవిత ముఖ్య సంఘటనలు వివరించు ఈ భాగములో సౌలుకు భయపడి ఆయన చేసిన అజ్ఞాత జీవితం, హెబ్రోనులో 7 సంవత్సరములు యూదా గోత్రమును మట్టుకు యేలినది. అనునవి విడువబడినవి. అదేవిధముగా బెత్సేబాతో దావీదు పడిపోయిన సంఘటనను ఈ గ్రంథకర్త వదిలివేసెను. దేవుని క్షమాపణ, ప్రేమ ఆశీర్వాదమహిమ అను వాటికి ముఖ్యత్వము ఇచ్చి చెర నుండి వచ్చిన దేవుని ప్రజలను విశ్వాసములోను, లోబడుటలోను, దేవుని భయంలోను దృఢపరచి స్థిరపరచవలెనన్న ఉద్దేశ్యముతో వదలవలసిన భాగములను వదిలి పెట్టి చేర్చవలసిన భాగములను చేర్చి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ గ్రంథకర్త ఈ గ్రంథమును వ్రాశాడు. దేవుడు దావీదుకు దేవాలయము కట్ట అనుమతిని ఇవ్వకపోయినప్పటికి కట్టుడు పని నిమిత్తము సకల సిద్ధపాటులను ఆయన చేయగలిగెను. దావీదు యొక్క బహిరంగమైన స్తోత్రముతో, సొలొమోను సింహానాసీనుడయ్యే దృశ్యముతో ఈ పుస్తకము ముగింపగుచున్నది.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 13వ పుస్తకము ; అధ్యాయములు 29; వచనములు 942; చరిత్రకు సంభందించిన వచనములు 927; నెరవేరిన ప్రవచనములు 81; నెరవేరనివి 71; హెచ్చరికలు 30; ఆజ్ఞలు 53; ప్రశ్నలు 19; వాగ్దానములు 9; దేవుని సందేశములు 8.

 


Share this post