Skip to Content

అపొస్తలుల కార్యములు

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

యసుక్రీస్తు చిట్టచివరిగా తన శిష్యులకు ఇచ్చినవి ఆజ్ఞలుగా వ్రాయబడిన వాక్యములను గొప్ప ఆజ్ఞలు అని పిలుచుచున్నాడు. యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు (అపో. కార్యములు 1:8) అనునవే ఆ పలుకులు. ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి ఆయన శిష్యులు విశ్వాసులు - పునరుత్థానుడైన రక్షకుని గూర్చిన సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించిన చివరి స్త్రీ పురుషుల వృత్తాంతమే లూకా వ్రాసిన అపొస్తలుల కార్యములు. రెండు భాగములుగా లూకా వ్రాసిన ఒక గ్రంథములో రెండవ భాగముగా చెప్పబడుచున్న గ్రంథమునకు ప్రత్యేక నామమేదియు లేదు. కాని ఇప్పటి వరకు దొరికిన గ్రీకు - చేవ్రాత ప్రతులలోను “ప్రాక్సెయిస్” అనగా “కార్యములు” లేక అపొస్తలుల కార్యములు అను నామమును చూడగలము. గ్రీకు సాహిత్యములో "ప్రాక్సెయిస్" అనే పదం ప్రసిద్ధిగాంచిన పురుషుల యొక్క సాధనలను క్రోడీకరించి ఇచ్చిన గ్రంథమని పిలిచెదరు. ఈ పుస్తకములో అపొస్తలులు అని సమూహ అర్ధముగా పిలువబడుతున్నప్పటికి మనకు కన్పించువారు ఇరువురు మాత్రమే 1 అపొస్తలుడైన పౌలు 2 అపొస్తలుడైన పేతురు వారి సేవ, త్యాగము, అద్భుతములు ముఖ్యముగా గుర్తించబడుచున్నవి.

ఉద్దేశము : క్రీస్తు సంఘ పుట్టుకను, సంఘవృద్ధిని తేట తెల్లముగా తెలుపుట.

గ్రంథకర్త : వైద్యుడైన లూకా

ఎవరికి వ్రాయడెబను : థెయొఫిలాకు

వ్రాయబడిన కాలము : క్రీ.శ. సుమారు 61 సంవత్సరము

గత చరిత్ర : క్రీస్తు జీవితమును క్రీస్తు సంఘాభివృద్ధిని కలుపు ఒక గొలుసుగా ఇది ఉన్నది. సువార్త పుస్తకములను పత్రికలను కలుపుగొలుసుగా కూడ ఇది ఉన్నది.

ముఖ్య వచనము : అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు. అపో. కార్యములు :8.

ప్రముఖ వ్యక్తులు : పేతురు, యోహాను, యాకోబు, సైఫను, ఫిలిప్పుపౌలుబర్నబాకొర్నేలియేసు సహోదరుడైన యాకోబుతిమోతి, లూదియ, సీలతీతు, అపొల్లో, ఫేస్తుఅగ్రిప్పలూకామార్కుఅననీయ, ఫెలిక్సు

ముఖ్య స్థలములు : యెరూషలేముసమరయ, యొప్పె, అంతియొకయ, ఈ కొనియ, పెసిదియ, లుస్త్ర, దెర్బె, ఫిలిప్పీ, థెస్సలోనికయ, బెరయఎఫెసు, కైసరియ, మెలితే, రోము, ఏథెన్సులుద్దపిసిదియలోనున్న అంతియొకయ, కొరింధీ.

గ్రంథ విశిష్టత : లూకా సువార్తకు పొడిగింపు గ్రంథముగా ఇది ఉన్నది.

ముఖ్య పదము : సంఘ అభివృద్ధి.

ముఖ్య వచనములు : అపో. కార్యములు 1:8అపో. కార్యములు 2:42-47.

ముఖ్య ఆధ్యాయము : అపొ. 2

యేసుక్రీస్తు తన శిష్యులకు పై నుండి శక్తి వచ్చువరకు యెరూషలేములో నిలిచి యుండుడని ఆజ్ఞాపించెను. ఈ వాగ్దానము ననుసరించి పరిశుద్ధాత్మ (దేవుడు) పెంతెకోస్తు దినమున మేడ గదిలో నున్న వారి మీదికి దిగి వచ్చెను. లోకమంతటా సువార్త ప్రకటించు పని ప్రారంభమాయెను. శిష్యుల బాధ్యత లోకమంతట సువార్త ప్రకటించి ఎవరును జయించలేనంత బలమైన సంఘముగా క్రీస్తు సంఘమును విస్తరింప చేయుటయే. ప్రభువు యొక్క అనాధి నిర్ణయం నెరవేర్చబడి, వారు సువార్త పనిలో ముందుకు కొనసాగుటకు శక్తివంతులుగా చేసెను.

గ్రంథ విభజన : లూకా సువార్త ముగిసిన చోటనే అపొస్తలుల కార్యములు గ్రంథము ప్రారంభమగుచున్నది. మత్తయి 28:19-20 వచనములలో యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్పు క్రమములో ప్రారంభ సంఘ చరిత్రాంశముల నింపియున్న గ్రంథమే ఈ అపోస్తలుల కార్యములు అను గ్రంథము. కొత్త నిబంధన సంఘపు ప్రారంభ చరిత్రను ఈ పుస్తకములో చూస్తున్నాము. యేసుక్రీస్తు ఆరోహణము, పెంతెకోస్తు దినమున పరిశుద్దాత్మ దిగి వచ్చుట మున్నగు వాటితో ప్రారంభమగుచున్న ఈ గ్రంథము - సువార్త ప్రకటన యెరూషలేములో ప్రారంభింపబడి రోమా మహాసామ్రాజ్య సరిహద్దులన్నింటిలోనికి వ్యాపించుటను వివరించుచున్నది.

అపొస్తలుల కార్యములు గ్రంథము పలు మలుపులను వివరించుచున్నది. సువార్త పుస్తకముల నుండి ప్రతికలలోనికి మార్చబడుట, యూదా మతము నుండి క్రైస్తవ మార్గములోనికి మార్చబడుట ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి మార్చబడుట యూదులు మాత్రమే దేవుని ప్రజలు అను భావము నుండి సమస్త జాతి ప్రజలు దేవుని ప్రజలగుదురను మార్పు ఈ గ్రంథము ద్వారా పొందగలము. పలు మలుపుల ప్రారంభములను లూకా వ్రాసిన ఈ గ్రంథములో మాత్రమే చూడగలము. ఈ గ్రంథములోని ముఖ్య వచనమైన అపో. కార్యములు 1:8లో లిఖితమైనట్టుగా సువార్త వ్యాప్తిని సూచించు మూడు భాగములుగా దీనిని విభజింపవచ్చును.

  1. యెరూషలేములో క్రీస్తును గూర్చిన సాక్ష్యము Acts,1,1-8,4
  2. యూదయ సమరయ దేశములలో క్రీస్తు సాక్ష్యం ప్రకటన Acts,8,5-12,25
  3. భూది గంతముల వరకు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము 13 - 28 అధ్యాయములు.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 44వ పుస్తకము. అధ్యాయములు 28; వచనములు 1007; ప్రశ్నలు 75; పాతనిబంధన ప్రవచనములు 21; క్రొత్త నిబంధన ప్రవచనములు 20; చరిత్రాత్మక వాక్యములు 949; నెరవేరిన ప్రవచనములు 49; నెరవేరనున్న ప్రవచనములు 14.


Share this post