Skip to Content

రెండవ రాకడ అంటే? ఎత్తబడుట అంటే?సంఘం ఎత్తబడుట (Rapture) ఎప్పుడు జరుగుతుంది ? అంత్యక్రీస్తు (Antichrist) ఎవరు ? ఎలా ఉంటాడు ? ఎప్పుడు వస్తాడు? బైబిల్ ఏమి చెప్తుంది?

23 September 2024 by
Sajeeva Vahini

 

A.  ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?

సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క ప్రాముఖ్యతను, మన వ్యక్తిత్వంపై దాని ప్రభావమునూ మరియు ఆచరణాత్మకతను గూర్చిన సంగతులను క్లుప్తంగా అధ్యయనం చేద్దాం.

 

ఒకానొక దినమున మనము మధ్యాకాశమునకు ఎత్తబడతాము అంటే అది ఆశ్చర్యమే కదూ!!. అయితే ఎత్తబడే ప్రక్రియ ఎలా సంభవిస్తుందనే మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపో. పౌలు ద్వారా కొరింథీ మరియు థెస్సలోనికయ సంఘాల పత్రికలలో వివరిస్తూ, మనలను సిద్దపాటు కలిగియుండమని హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తుయేసు నందుండి మరణిస్తారో వారు కడబూర మ్రోగగానే సమాధులు తెరవబడి అక్షయులుగా లేపబడతారు, ఆమీదట సజీవులుగా వున్నవారమైతే మార్పుపొంది మహిమ శరీరులముగా మార్చబడతారు. ఆమీదట మధ్యాకాశములో మేఘారూడుడైన ప్రభువును ఎదుర్కొంటాము. ఇదంతా రెప్పపాటులోనే జరిగిపోతుంది. ఇదే సంఘము ఎత్తబడుట.

 

సంఘము ఎత్తబడినది అంటే సంఘము ఇక భూమి మీద వుండదు అని గ్రహించాలి. వాక్యముతో వుదకస్నానముచేత పరిశుద్ధ పరచబడిన నిష్కళంకమైనట్టిదియూ నిర్దోషమైనట్టిదియూనైన సార్వత్రిక సంఘము ఆ రీతిగా భూలోకమునుండి ఎత్తబడిన తరువాత, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను విప్పుతారు. విడువబడిన వారికి మూడున్నర యేండ్లు శ్రమల కాలము మరియు మూడున్నర యేండ్లు మహాశ్రమల కాలము వుంటాయి. ఏడేండ్ల శ్రమలకాలము ముగియగానే తన స్వరక్తమిచ్చి కొనబడిన పరిశుద్ధుల పరివారముతో క్రీస్తు దిగివస్తాడు. ఇదే రెండవ రాకడ. ఈ లోక రాజ్యములన్నియూ ఒక రాజ్యమై, మన ప్రభువు రాజ్యమై, క్రీస్తు రాజ్యమై రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా తన రాజ్యాన్ని ఈ భూమిమీద స్థాపించి, వెయ్యియేండ్లు పరిపాలిస్తారు.

 

క్రీస్తు మరణ భూస్థాపన, పునరుత్థానములను, విశ్వసించి, ఎత్తబడిన పరిశుద్దులకు అలాగే ఆయన నామము నిమిత్తము హతసాక్ష్యులైన వారికందరికీ అర్హతలను బట్టి ప్రత్యేక స్థలములలో వుంచబడతారు. వారు మహిమ కిరీటములు పొందుతారు. ఈ లోకంలో ఎంతకాలము జీవించినా ఒకనాడు మరణించాల్సిందే. శరీరము మరణించి శిధిలమై పోతుంది కాని ఆత్మకు మరణం లేదు. మనిషికి మరణం ఒక రూపాంతర ప్రక్రియ మాత్రమే. అంతిమ తీర్పు అనంతరము నిత్యత్వములోనికి వెళ్లిపోతాము, అప్పుడు దృశ్యమైన ప్రతిదీ లయమై పోతుంది, ఆత్మలు పరిశుద్దాత్మునిలో అంతర్లీనమై అంతములేని, ఆకలి దప్పులు లేని ఆ అమరత్వములో మహిమాన్వితునితో విలీనమౌతాయి. ప్రియ క్రైస్తవ నేస్తం, ఎత్తబడుటకు నీవు ఆయత్తమా ? లేని యెడల విడువబడతావు. ఎత్తబదుట మహిమాన్వితం, విడువబడుట బహు ఘోరం.

B.  సంఘం ఎత్తబడుట (Rapture) ఎప్పుడు జరుగుతుంది ?

అంత్యక్రీస్తుకు సంబంధించి ఎత్తబడుటను గూర్చిన సమయంఎపుడు జరుగుంది అనే ఖచ్చితమైన సంగతులను గూర్చి వివిధ క్రైస్తవ వేదాంత దృక్పథాల మధ్య చర్చనీయాంశమైంది. ఈ అంశము పై బైబిలులో మూడు ప్రధాన దృష్టికోణాలు ఉన్నాయి:

1.    Pre-Tribulation Rapture - శ్రమల కాలం ప్రారంభం కంటే ముందు సంఘం ఎత్తబడవచ్చు,అంత్యక్రీస్తు కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక దృష్టికోణం.

a.    1 థెస్స4:16-17 (Rapture Passage)16. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

b.    ప్రకటన 3:10 (Believers kept from Tribulation)10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.

2.    Mid-Tribulation Rapture - శ్రమల మధ్యలో సంఘం శ్రమలను తప్పించడానికి, అంత్యక్రీస్తు బయలుపరచబడిన తరువాత కూడా ఎత్తబడుతుంది అనేది మరో దృష్టికోణం.

a.    దానియేలు 7:25 (Reign of the Antichrist during Tribulation)25. ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

b.    ప్రకటన 11:15 (The Seventh Trumpet)15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

3.    Post-Tribulation Rapture - శ్రమల చివర, అంటే ఎవరైతే శ్రమలను తట్టుకొని, అంత్యక్రీస్తు వలన కలిగిన శ్రమలను భరించి, ఎందరైతే క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడతారో వారు సంఘముగా ఎత్తబడుతారు అనేది మరో దృష్టికోణం

a.    మత్తయి 24:29-31 (Rapture at Christ’s Second Coming)29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.31. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

b.    ప్రకటన 20:4-6 (Believers and Tribulation)4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయ తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

ఈ మూడు దృష్టి కోణాలను బట్టి సంఘం ఎత్తబడే సమయం బైబిలులో ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవడం కొంత ఆలోచించవలసిన విషయమే. మార్కు 13:32 ప్రకారం యేసు క్రీస్తు మనకు చెప్పినట్టు “ ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు.” అయితే  క్రీస్తు మధ్యాకాశమునుండి మేఘారుడుడై ఉంటాడని, రెప్పపాటులో సంఘం ఎత్తబడుతుంది అని బైబిల్ లో పేర్కొనబడింది. సంఘం ఎత్తబడిన తరువాతే కడబూర శభ్దముతో క్రీస్తు రారాజుగా తిరిగి వస్తాడు అనేది రెండవ రాకడ. ఏది ఏమైనప్పటికి కూడా ఎన్ని శ్రమలు కలిగినా మన విశ్వాసంలో, రక్షణలో ఎటువంటి వెనుకంజ మనం వేయకుండా, నేడైనా రేపైనా, మనం జీవించినా, రాకడ ఆలస్యమై మనం మరణించినా,  మనం సిద్ధపాటు కలిగియుంటేనే ఎత్తబడే గుంపులో ఉంటాము అనే సంగతి మరచిపోకూడదు.

 

C. అంత్యక్రీస్తు ఎవరు?ఎలా ఉంటాడు ? ఎప్పుడు వస్తాడు?

నిర్వచనం: "అంత్యక్రీస్తు" అనే పదానికి అక్షరాలా "క్రీస్తుకు వ్యతిరేకంగా" లేదా "క్రీస్తుకు బదులుగా" అని అర్థం. ఇది క్రీస్తు మరియు అతని బోధనలకు వ్యతిరేకతను సూచిస్తుంది.

లేఖన సూచనలు:1 యోహాను 2:18చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.ఈ వాక్యభాగంలో అనేకమంది క్రీస్తు వ్యతిరేకులను సూచిస్తాడు మరియు చివరి ఘడియలో రాబోతాడని హెచ్చరించాడు, ఇది ఒక నిర్దిష్టమైనఅంత్యక్రీస్తుసూచిస్తుంది.

దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, తనను తాను హెచ్చించుకునే "నాశన పాత్రుడు" గురించి పౌలు వర్ణించాడు, తరచుగా క్రీస్తు విరోధితో సంబంధం కలిగి ఉంటాడు అని ఈ వాక్యంలో గమనించగలం - 2 థెస్సలొనీకయులు 2:3-43. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

దానియేలు 9:27 (Covenant and Abomination of Desolation) 27. అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.

ప్రకటన 13: ఈ అధ్యాయం సముద్రం నుండి పైకి లేచిన మృగం గురించి వివరిస్తుంది, దీనిని చాలా మంది అంత్యక్రీస్తుఅని అర్థం చేసుకుంటారు. దానికి అధికారం మరియు శక్తి ఉంది, మోసం చేయడానికిమరియు అద్భుతాలు చేయడానికి కూడా శక్తి ఉంది.

లక్షణాలు: అంత్యక్రీస్తుఅనేకులను మోసగించి, వారిని సత్యారాధన నుండి దూరం చేసి, చివరికి శ్రమలకు అప్పగిస్తాడని చిత్రీకరించబడ్డాడు.

అంత్య కాలంలో అతని పాత్ర : అంత్యదినాలకు సంబంధించిన అనేక వివరణలలో, క్రీస్తు తిరిగి వచ్చే ముందు అంత్య కాలంలో, ప్రత్యేకించి మహా శ్రమలు ఉన్న సమయంలో అంత్యక్రీస్తుముఖ్యమైన పాత్ర పోషిస్తాడు అని గమనించగలం.

క్రీస్తుకు వ్యతిరేకత: తప్పుడు రాజ్యాన్ని స్థాపించడానికి మరియు విశ్వాసులను మోసగించాలని కోరుతూ, క్రీస్తు అధికారానికి ప్రత్యక్ష సవాలుగా పాకులాడే కనిపిస్తాడు.

Dr. G. Praveen Kumar, MCA, M.Div, Ph.D (BS), D.Min

Sajeeva Vahni, India. 8898318318. info@sajeevavahini.com, www.sajeevavahini.com

Share this post